భారత క్రికెట్ దిగ్గజం, మాజీ రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్ లో పాల్గొనేందుకు చంద్రబాబు సింగపూర్ వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ చంద్రబాబును టెండూల్కర్ కలిసారు. చంద్రబాబుని చుసిన వెంటనే, "మై బెస్ట్ చీఫ్ మినిస్టర్" అంటూ బాబుని పలకరించారు... చంద్రబాబు, తనతో పాటు వచ్చిన మంత్రుల్ని, ఏపి ప్రతినిధులని పరిచయం చేసారు.. సచిన్ దత్తత తీసుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టంరాజు కండ్రిగ గ్రామం అభివృద్ధికి సంబంధించిన అంశంపై చర్చించారు.. ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తుందని సచిన్‌కు సీఎం తెలిపారు. ఈ గ్రామం అబివృద్ధిపై సచిన్, చంద్రబాబుల మధ్య కాసేపు చర్చ జరిగింది.
కాగా, హెచ్‌టీఎల్‌ఎస్‌లో పాల్గొన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలు, ప్రణాళికలను వివరించారు. రాబోయే నాలుగైదేళ్లలో రాష్ట్ర ప్రాథమిక విద్య ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా మారుస్తామని, దీనికోసం అరటి, మామిడి పంటలను అక్కడ విస్తరిస్తున్నామని వివరించారు. అలాగే, ఐటీ రంగంలోనే కాకుండా అనేక అంశాలలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని టాటాసన్స్‌బోర్డు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తెలిపారు. సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం నటరాజన్‌తో సమావేశమయ్యారు. ఏపీలో టీసీఎస్ కార్యకలాపాలు పెద్దఎత్తున చేపట్టాలని ఈ సందర్భంగా సీఎం వినతి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన నటరాజన్ ఏపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
అమరావతికి రావడానికి నటరాజన్ స్పష్టమైన ఆసక్తిని వ్యక్తం చేశారు. అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అమరావతిలో విద్యుత్ బస్సులు, కార్లు వంటి ఆధునిక రవాణా వ్యవస్థలో భాగస్వాములం అవుతామని ఆయన వెల్లడించారు. ఏపీలో సంపూర్ణ కాలుష్యరహిత రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని సీఎం తెలుపగా ఈ రంగంలో పెట్టుబడులకు ఎంతో ఆసక్తిగా ఉన్నామన్న నటరాజన్ చెప్పారు. 3 వారాల్లో అమరావతికి వస్తామని, హోటళ్లు, స్మార్ట్ సిటీస్, రవాణా వంటి అంశాలపై చర్చిస్తామని సీఎం చంద్రబాబుకు నటరాజన్ తెలిపారు.