ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లెలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోజు మనది కోడికత్తిపై పోరాటం కాదని, కేసీఆర్ పైనా, మోదీపైనా పోరాటం అని స్పష్టం చేశారు. జగన్, కేసీఆర్, మోదీ ముగ్గురినీ కట్టకట్టి బంగాళాఖాతంలో పారేయాలని పిలుపునిచ్చారు. "మనకి అన్యాయం జరిగిందా? లేదా?. మోదీ న్యాయం చేశాడా? నమ్మకద్రోహం జరిగిందా? లేదా? వెంకన్నను కూడా మోసం చేసిన వ్యక్తి మోదీ. ప్రజాస్వామ్యాన్ని కూడా అపహాస్యం చేశాడు. ఈ రోజు 66 మంద ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాష్ట్రపతి వద్దకు వెళ్లి ఎన్నికల సంఘం మోదీ ఆధ్వర్యంలో పనిచేస్తోందని ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చింది. "రాష్ట్రపతి గారూ మీరు జోక్యం చేసుకోండి, ఈసీకి స్వయంప్రతిపత్తి లేదు, ఇది దేశానికి మంచిది కాదని ఫిర్యాదు చేశారంటే ఇది మోదీ అన్యాయ పాలనకు పరాకాష్ట తప్ప మరోటి కాదు. నేను సంవత్సరం నుంచి పోరాడుతున్నా. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారు. ఆర్బీఐని కుప్పకూల్చారు. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని కూడా ఉపయోగించుకుని మనపై దాడులు చేయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమరపాటుగా ఉంటే ఇవే మనకు చివరి ఎన్నికలు అవుతాయి" అంటూ ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు.

కేసీఆర్ తనను సన్నాసి అనడంపై సీరియస్ గా స్పందించిన ఆయన "ఏం తమ్ముళ్లూ మీ ముఖ్యమంత్రి సన్నాసా? కేసీఆర్ గొప్ప నాయకుడా? కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. నోరు అదుపులో పెట్టుకోవాలి. నా జోలికి వస్తే తాటతీస్తాను తప్ప వదిలిపెట్టను. నీలాగా నేను నోటికి వచ్చినట్టు మాట్లాడను. నాకు హుందాతనం ఉంది. మీకు, నరేంద్ర మోదీకి బుద్ధి రావాలంటే మీ భాష వాడితే తప్ప మీకు బుద్ధి రాదు. 100 మంది మోదీలు నన్నేమీ చేయలేరు. 500 మంది కేసీఆర్ లు ఏమీ చేయలేరు. 1000 కోడికత్తులు కూడా ఏమీ చేయలేవు తమ్ముళ్లూ!" అంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. జగన్‌లాంటి అవినీతిపరుడు, అసమర్థుడు సీఎం అయితే...ఏపీ తమ గుప్పిట్లో ఉంటుందని కేసీఆర్ భ్రమపడుతున్నారని చంద్రబాబు అన్నారు.

తెలంగాణ వస్తే దళితుడిని సీఎంను చేస్తామని కేసీఆర్ అన్నారు. మరి చేశారా? అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతామని కేసీఆర్ వాగ్దానం చేశారని, ఇచ్చిన మాట నిలుపుకోలేదని విమర్శించారు. అప్పుడు తెలంగాణను మోసం చేశారని, ఇప్పుడు ఏపీని మోసం చేయాలని చూస్తున్నారని, ప్రత్యేకహోదాకు సహకరిస్తామని మభ్య పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరంపై కేసీఆర్‌ కూతురే కోర్టుకెళ్లిందని చంద్రబాబు విమర్శించారు. జగన్‌కు ఓటేస్తే మనకు నీళ్లురావని...రాజధాని ఆగిపోతుందని, మన ఆస్తులు మనకు రాకుండా పోతాయన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయాలని చంద్రబాబు సూచించారు. జగన్‌కు ఓటేస్తే కేసీఆర్‌ పెత్తనాన్ని కొని తెచ్చుకున్నట్టేనని అన్నారు. కేసీఆర్-జగన్‌ తోడుదొంగలని ఇప్పటికే రుజువైదన్నారు. ఏపీ ప్రజలు అప్రమత్తమై కళ్లు తెరచి ఓటేయాలన్నారు. నరేంద్రమోదీకి కేసీఆర్‌, జగన్‌ పెంపుడు కుక్కలని, మోదీ వేసే బిస్కెట్‌ కోసం ఆశపడుతున్నారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read