అధికార విపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలు, నాయకుల వలసలతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన వేళ రాజకీయాలపై తెదేపా అధినేత చంద్రబాబు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఉదయం నుంచి అర్ధరాత్రి దాటేవరకూ నేతలతో ఎడతెరిపి లేని సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే దాదాపు 25 వేల మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను శ్రేణులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ మార్గనిర్దేశం చేస్తున్నారు. టెలికాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత తాజా రాజకీయాలపై వ్యూహ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీలోని కొందరు ముఖ్యనాయకులతో మంత్రాంగం సాగిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశాన్ని దెబ్బతీసేందుకు వైకాపా, భాజపా చేస్తున్న విమర్శలను దీటుగా తిప్పికొట్టేందుకు సీనియర్ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడైనా కుట్రకోణం దాగి ఉంటే దాన్ని వెంటనే బహిర్గతం చేసేలా సమాయత్తమవుతున్నారు.
ఇటీవల దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై వచ్చిన ఆరోపణలను తిప్పి కొట్టడమే ఇందుకు ఉదాహరణ అని పార్టీ వర్గాలు అంటున్నాయి. సదరు వీడియోను ఏమార్చిన విషయాన్ని ప్రజలకు తెలిసేలా చేయడంతో చింతమనేని సమస్య నుంచి బయటపడ్డారని పేర్కొంటున్నాయి. ఇక రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ కేసీఆర్ ప్రకటించడం, కేటీఆర్ వెళ్లి జగన్‌ను కలవడం, తెలంగాణ మంత్రి తలసాని తరచూ రాష్ట్ర పర్యటనకు రావడాన్ని నిశితంగా గమనిస్తున్న తెదేపా.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై హైదరాబాద్ వేదికగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్న ఆంధ్రా నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని నేతలకు వివరిస్తున్న చంద్రబాబు.. ఇటీవల పార్టీ మారిన అవంతి శ్రీనివాస్‌కు తెలంగాణలో కళాశాలలు ఉండడం, గతంలో పేపర్ లీకేజీ అభియోగాలు ఉండడం వంటి పరిణామాలను గుర్తు చేస్తున్నారు.
మరో ఎంపీ బంధువు ఇంట్లో ఐటీ దాడులు చేయించి అతన్ని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తుండడాన్ని టెలికాన్ఫరెన్సులో స్వయంగా లేవనెత్తుతున్న చంద్రబాబు వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. తనను ఆటోవాలాలందరూ డ్రైవర్ నంబర్ వన్ అంటున్నారని, రాష్ట్రాన్ని నడపగలిగే డ్రైవర్ చంద్రబాబేనంటున్నారని సంతోషం వ్యక్తం చేసిన సీఎం అక్కడినుంచి జగన్ పై విమర్శలు గుప్పించారు. ‘ఆటో యజమానులు అంతా నన్ను డ్రైవర్ నెంబర్ 1 అంటున్నారు. మేం ఆటోను భద్రంగా నడుపుతాం. మీరు రాష్ట్రాన్ని భద్రంగా నడిపిస్తారు అంటున్నారు. జగన్మోహన్‌రెడ్డికి డ్రైవింగ్ చేతకాదు. డ్రైవింగ్ స్కూల్ కు పోలేదు. డ్రైవింగ్ రానివాడికి వాహనం ఇస్తే యాక్సిడెంట్లే. జగన్‌మోహన్ రెడ్డికి రాష్ట్రం అప్పగిస్తే యాక్సిడెంట్లే’ అని కార్యకర్తలతో చంద్రబాబు అన్నారు.