దేశ ప్రధానికి ఒక రూలు.. సీఎంలకు ఒక రూలా? అని సీఎం చంద్రబాబు ఈసీని ప్రశ్నించారు. తుపాన్లు వచ్చినా ముఖ్యమంత్రులు సమీక్షలు చేయొద్దా? అని నిలదీశారు. అదే ప్రధాని అయితే ఏదైనా మాట్లాడొచ్చా.. రాజకీయాలు చేయొచ్చా? అని ప్రశ్నించారు. ప్రధానికి ఏ కోడ్ అడ్డురాదా? అంటూ ఈసీ తీరును ప్రశ్నించారు. ఈ మేరకు అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడారు. పలు రాష్ట్రాల్లో ఈవీఎంల మొరాయింపు, విపక్షాలపై ప్రధాని మోదీ చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఓవైపు ఫణి తుపాను ముంచుకొస్తుంటే, మరోవైపు తుపానుపై సమీక్షకు కూడా అవకాశం లేకుండా ఈసీ చేస్తోందని దుయ్యబట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలపై రేపట్నుంచి తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని... ఈసీని అడుక్కుని సమీక్షలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానికి అడ్డురాని ఎన్నికల కోడ్ ముఖ్యమంత్రులకు మాత్రమే ఎందుకు అడ్డొస్తోందని ప్రశ్నించారు.
‘‘ఏపీలో మాదిరిగానే ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని తగ్గించడం కోసమే బెంగాల్లో ఏడు దశల్లో ఎన్నికలు పెట్టారు. ఈవీఎంలపై ఎప్పట్నుంచో పోరాడుతూనే ఉన్నాం. మా పోరాట ఫలితమే వీవీప్యాట్లు తీసుకొచ్చారు. 2019కి వంద శాతం వీవీప్యాట్లు వచ్చాయి. చాలా దేశాలు పేపర్ బ్యాలెట్లోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. యూపీలో సమాజ్వాదీ పార్టీకి వేస్తే కమలం గుర్తుకు ఓట్లు పడ్డాయి. మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్లోనూ ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే నేను మాట్లడడం లేదు. దేశవ్యాప్తంగా పారదర్శకత కోసమే వీవీప్యాట్లు వినియోగించాలని కోరుతున్నాం’’ అని చంద్రబాబు అన్నారు.
‘‘మోదీ ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి చేరింది. ఈ నెల 23న ఫలితం ఎలా ఉండబోతోందో ఇప్పుడే అర్థమైనట్లు ఉంది. అందుకే విపక్షాల ఉనికిని కూడా మోదీ సహించలేకపోతున్నారు. ప్రతిపక్షాలను చూసి ఓర్వలేకపోతున్నారు. ప్రతిపక్షాలు కొత్త దుస్తులు కొనుక్కుంటున్నారని మాట్లాడుతున్నారు. ఏదీ తోచక అలా మాట్లాడుతున్నారు. ఆయనే గంటకో డ్రెస్ మార్చి ఆర్భాటంగా రాజకీయాలు చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్కో డ్రెస్సు.. లంచ్కి మరో డ్రెస్సు.. మధ్యాహ్నం ఇంకో డ్రెస్సు. మోదీ చెప్పిన మార్పు డ్రెస్సులు మార్చడంలోనే కనిపిస్తోంది’’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘‘విపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరని మోదీ అడుగుతున్నారు. మా విధానం పై మాకు క్లారిటీ ఉంది. ఎన్నికలు పూర్తికాగానే కూర్చుంటాం. తదుపరి వ్యూహాలను ఖరారు చేసుకుంటాం’’ అని చంద్రబాబు వివరించారు.