ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం జరుగుతున్న తీరు పై చంద్రబాబు సమీక్ష చేశారు...పార్టీతోపాటు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే... సి, డి గ్రేడ్లల్లో ఉన్న ఎమ్మెల్యేలకు, ఇన్చార్జ్‌లకు సీఎం చంద్రబాబునాయుడు క్లాస్ తీసుకున్నారు... ఆ సందర్భంలో తన వద్దకు వచ్చిన సమాచారాన్ని గురించి చెబుతూ ఒక్కొక్కరిపై ఒక్కోలా జోకులేస్తూనే చురకలు అంటించారు... చంద్రబాబుని ఇలా చూసి అక్కడ ఉన్నవారందరూ అవాక్కయ్యారు..
కొన్ని జిల్లాల్లో, కొందరు ఎమ్మెల్యేలు ఆయనకు వీడియో కాన్ఫరెన్స్ లో కనిపించలేదు... "వారు రాలేదా... బిజీగా ఉన్నారేమో... అడిగాను అని చెప్పండి" అనగానే, అక్కడ ఉన్నవారు నవ్వేసారు... ఇక తెనాలి ఎమ్మెల్యే ప్రస్తావనకు వచ్చిన వేళ, ఆయన ఎక్కడున్నాడని చంద్రబాబు ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లారన్న సమాధానాన్ని అధికారులు చెప్పగా, "అయితే అడిగానని చెప్పండి. క్షేమాన్ని అడగండి" అంటూ జోకేశారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే రామారావు విదేశీ పర్యటన గురించి, ఆ జిల్లా నేతలు చెప్పగా, మళ్లీ అదే శైలిలో 'ఆయనకు ఇంటర్నెట్ ద్వారా హలో చెప్పండి' అని అన్నారు.
పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే వంశీ తదితరులు తమ సొంత టెక్నాలజీని వాడుతున్నారని, ప్రభుత్వం ఇచ్చే టెక్నాలజీ పనిచేయడం లేదామో? అని చమత్కరించారు. పామర్రు, అవనిగడ్డ, గన్నవరం, పెనమలూరు ఎమ్మల్యేలను "మహానుభావులు" అంటూ సంబోధించారు... గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి బాగా వెనుకబడ్డారు అని ఆయన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అక్కడున్న అందరినీ నవ్వించాయి. "ఏంటి వేణు... కుమారస్వామిలా కష్టపడి తిరగకుండా వినాయకుడిలా ఈశ్వరుడి చుట్టూ తిరిగితే చాలని అనుకుంటున్నావా?" అని చమత్కరించారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే డేవిడ్ రాజును చూసి, రోజుకు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నారని చంద్రబాబు ప్రశ్నించగా, పది కిలోమీటర్లు తిరుగుతున్నానని ఆయన బదులిచ్చారు. "ఓ... అయితే మీ ఫిట్ నెస్ బాగుంటుంది" అని చంద్రబాబు కితాబిచ్చారు. ఇలా అందరికీ చురకలు అంటించి, గెట్టిగా పనిచెయ్యాలి అని అన్నారు....