ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఈ రోజు, భావోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు అమరావతి పై తెలుగుదేశం పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశం విజయవాడలో జరుగుతంది. బీజేపీ, సిపియం మినహా అన్ని పార్టీలు, ఈ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరు అయ్యారు. ఈ సమవేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతి నిర్మాణం భావితారల కోసమని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రారంభించామని అన్నారు. విభజనతో గాయపడిన మనకు, ధీటుగా సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో, అమరావతి ఆంధ్రుల రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా, నిర్మాణం చెయ్యాలని అనుకున్నామని అన్నారు. తెలంగాణాకు హైదరాబాద్ ఎలా ఉందొ, కర్ణాటకకు బెంగుళూరు ఎలా ఉందొ, తమిళనాడుకు చెన్నై ఎలా ఉందొ, కేరళకు కొచ్చి ఎలా ఉందొ, మన పక్కన ఉన్న రాష్ట్రాలకు ధీటుగా, ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణం చెయ్యాలని అనుకున్నామని అన్నారు.
నేను చేసిన ఈ సంకల్పం, అమరావతి ప్రాజెక్టు తప్పు అని ప్రజలు కనుక అంటే, వారికి క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబు భావోద్వేగంగా ప్రకటన చేసారు. ప్రతి తెలుగు బిడ్డ గర్వ పడేలాగా ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం తల పెట్టామని, నేను చేసిన ఈ పని తప్పు అని ప్రజలు కనుక చెప్తే, నేను వారికి ఈ పని చేసినందుకు క్షమాపణ చెప్తానని చంద్రబాబు అనటంతో, అక్కడ వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారింది. ఈ రౌండ్ టేబల్ సమావేశానికి, సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన నుంచి పోతిన మహేష్, ఆర్‌ఎస్పీ నుంచి జానకి రాములు, ఫార్వర్డ్ బ్లాక్, లోక్‌సత్తా, ఆమ్ ఆద్మీ, ప్రజా సంఘాల నేతలు, తదితరులు హాజరయ్యారు.
చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతిలో ఇప్పటి వరకు ఏమి జరిగింది, ఏమి జరగాలి, ఎందుకు ఆగింది, లాంటి విషయాలు ప్రస్తావిస్తూ, అమరావతిని పరిరక్షించుకోవటమే, ధ్యేయంగా, ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టామని అన్నారు. ఈ భవనాలన్నీ గ్రాఫిక్స్ కాదు-నేలపై నిజాలు’’ వీడియో ప్రజెంటేషన్ చూపించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు, ఇతర రోడ్లు ఎంతమేర పూర్తయ్యాయి, హైకోర్టు, జడ్జిల బంగ్లాలు, ఐఏఎస్ అధికారుల గృహ సముదాయం, ఎన్జీవోల హవుసింగ్ కాంప్లెక్స్, పేదల గృహ సముదాయాల నిర్మాణ పురోగతిపై వీడియో చూపారు. ప్రజారాజధాని అమరావతిలో ఏం జరుగుతుందో అందరికీ అవగాహన ఉండాలని చంద్రబాబు అన్నారు. ఎక్కడైనా ప్రభుత్వాలు మారుతుంటాయి. బాధ్యతగా వ్యవహరిస్తే ప్రజలంతా సహకరిస్తారు. ఇష్టానుసారం ప్రవర్తించి అన్యాయం చేస్తే సహించరని చంద్రబాబు అన్నారు.