తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, భాజపాలకు వ్యతిరేకంగా క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయించారు. భావసారూప్యంగల పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తేవాలని, ఆంధ్రప్రదేశ్‌తో మొదలు పెట్టి వరుసగా ఆయా రాష్ట్రాల్లో భారీ సభలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. బుధవారం ఉండవల్లిలోని ప్రజా వేదికలో జరగాల్సిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం వాయిదా పడిన తర్వాత ఆయన మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. కేంద్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తెదేపా ఎలాంటి పాత్ర పోషించాలన్న అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. చంద్రబాబు ప్రధాని కావాలంటూ మంత్రులు ఎక్కడా వ్యాఖ్యలు చేయవద్దని సీఎం స్పష్టంచేశారు.
‘‘బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ శక్తులను కూ డగట్టడంలో కీలకపాత్ర పోషిద్దాం. కొన్ని పార్టీలు ఎన్నికల ముందు బయటకు రావచ్చు. కొన్ని ఎన్నికల తర్వాత బయటపడవచ్చు. శరద్‌పవార్ ఎన్నికల ముందు కలిసి రాకపోవచ్చు. నవీన్ పట్నాయక్ వంటి వారు ప్రస్తుతం బీజేపీతో సఖ్యతతో ఉన్నారు. తర్వాత ఏం చేస్తారో చూడాలి. అందరినీ సమన్వయపర్చడానికి ప్రయత్నం చేస్తా. ఎన్నికల తర్వాత దేశ ప్రధాని ఎవరో మనం నిర్ణయిద్దాం. కానీ, మనకు ప్రధాని పదవి అవస రం లేదు. నాకు ఈ రాష్ట్రమే ముఖ్యం. నేను ఇక్కడ నుంచి ఎక్కడికీ వెళ్లను. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో భాజపా, మోదీలకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కావాలి. దేశ ప్రయోజనాల కోసం మనం కేంద్రంలో కీలక పాత్ర పోషించాలి’’ అని చంద్రబాబు తెలిపారు.
‘‘మేం ప్రధాని పదవిని కోరుకోవడం లేదు. దేశాన్ని పరిపాలించాలన్న కోరిక ఎంతమాత్రం లేదు. దేశంలో ప్రధాని ఎవరుండాలన్నది మేం నిర్ణయించాలనుకున్నాం. 2019లో తెదేపా నిర్ణయాత్మక శక్తిగా అవతరించనుంది. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న అప్రజాస్వామిక చర్యల వల్ల దేశ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమకు నచ్చినవారికి మేలు చేసేందుకు, కొన్ని కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం మోదీ ఎంత దూరమైనా వెళ్లి దేశ ప్రయోజనాలకు భంగం కలిగిస్తారని అర్ధమవుతోంది. దేశ రాజకీయాల్లో చంద్రబాబుకి ఉన్న అనుభవం, పరిచయాల్ని దేశానికి ఒక మంచి ప్రభుత్వం అందించేలా ఉపయోగించాలని, పాత మిత్రులు, లౌకికవాదులు, ప్రజాస్వామిక శక్తుల్ని ఒక తాటిపైకి తేవాలని నిర్ణయించాం. వివిధ పార్టీలను కూడగట్టి సభలు, సమావేశాలు నిర్వహించిన అనుభవం తెదేపాకి ఉంది. మోదీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం రాష్ట్రంలో మేం చేస్తున్న పోరాటాన్ని జాతీయ స్థాయికి విస్తరించాలని సమావేశంలో నిర్ణయించాం’’ అని ఒక సీనియర్ మంత్రి వివరించారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు.