ఆంధ్రప్రదేశ్ రాజాధాని అమరావతిలో నూతనంగా నిర్మిస్తున్న హైకోర్టు భవనాలను జనవరి ఒకటో తేదీ నాటికల్లా సిద్ధం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజధాని పర్యటనకు వచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్, ఇతర న్యాయమూర్తులను విజయవాడలోని హోటల్ గేట్‌వేలో ముఖ్యమంత్రి, మంత్రులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం చంద్రబాబు విలేఖరులతో మాట్లాడుతూ శాశ్వత సచివాలయం ఎదురుగా నిర్మించే ఐకానిక్ టవర్‌లో చేపట్టిన హైకోర్టు భవన నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు నోటిఫికేషన్ జారీచేస్తే హైకోర్టును హైదరాబాద్ నుంచి తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీజే వివరించారని తెలిపారు.
నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు సీఆర్డీఏ అధికారులు హైకోర్టు జడ్జిలు, సుప్రీం కోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, తదితరులతో సంప్రదింపులు జరుపుతూ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ముందుగా జిల్లా కోర్టు భవన నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. క్వార్టర్లను ఎక్కడ కావాలంటే అక్కడ నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నివాస భవనాల పట్ల న్యాయమూర్తులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. రాష్ట్రంలో సీబీఐ తనిఖీలకు ప్రభుత్వ అనుమతి కోరాల్సి రావటంపై విలేఖరులు ప్రస్తావించగా దేశంలో ఎన్నడూ లేనివిధంగా సీబీఐ భ్రష్టుపట్టిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
అలాంటప్పుడు రాష్ట్ర అధికారాలను ఆ సంస్థకు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. సీబీఐ కంటే రాష్ట్రంలో మన వ్యవస్థల పనితీరే మెరుగ్గా ఉందని కితాబిచ్చారు. ఏసీబీ, తదితర సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాల అధికారాలను కేంద్రానికి ఎలా అప్పగిస్తామని ఆయన ప్రశ్నించారు. సీబీఐ అధికారుల మధ్య గొడవలతో పాటు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చారన్నారు. దీనిపై సుప్రీం కోర్టులో కేసులు నడుస్తున్నాయని, అవన్నీ తేలాల్సి ఉందన్నారు. మన రాష్ట్రంలో వ్యవస్థలే బెటర్‌గా ఉన్నప్పుడు మనవాటిని మనమే ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతోనే సీబీఐకి అనుమతిని రద్దు చేశామన్నారు.