పశ్చిమ గోదావరి జిల్లాలో, గ్రామదర్శిని – గ్రామవికాసం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటిస్తూ ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మట్లడుతూ చంద్రన్న భీమ పధకం ద్వారా లక్షా 20 వేలు కుటుంబాలకు 2వేల కోట్ల రూపాయలు బీమా సోమ్మును అందించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 అన్న క్యాంటీన్‌లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకూ 60 క్యాంటీన్‌లు ఏర్పాటు చేసామన్నారు. యువనేస్తం పథకం ద్వారా నిరుద్యోగులకు రూ.1000 పెన్షన్ ఇచ్చి,యువతకి అండగా నిలుస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడా ఈ విధమైన పెన్షన్ ఇవ్వలేదని తెలిపారు.
రాష్ట్రంలో కోటి 44 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని, మరో 4 కోట్ల 14 లక్షల మందికి రేషన్ అందిస్తున్నామన్నారు. అందరికి ఇళ్లు కల సాకారం చేయాలనే ఉద్ధేశంతో గ్రామాల్లో 13.30 లక్షలు, పట్టణాల్లో 7.40 లక్షలు ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. మరో 5 లక్షల ఇళ్లు మంజూరు చేసామన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తీసుకున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాజధాని నిర్మాణం కష్టంతో కూడుకున్న పని అంటూ ఈ విషయంలో కేంద్రం సహకరించకపోయినా అద్భుత రాజధాని నిర్మిస్తామని అన్నారు.
ఈ నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామికీకరణకు కృషి చేస్తుంటే వైసిపి, ఇతర పార్టీలు అడ్డుపడుతున్నాయన్నారు. ఎన్నో భారీ పరిశ్రమలు రాష్ట్రానికి రాబోతున్నాయన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్‌లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. వైసిపి తన అవినీతి కార్యక్రమాలను కాపాడుకోవడానికి కేంద్రంలో బిజెపితో కుమ్మక్కయిందన్నారు. రాజధాని బాండ్లు లిస్టింగ్ అయిన గంటలోనే ప్రభుత్వంపై నమ్మకంతో ఒకటిన్నర రెట్లు పెరిగాయన్నారు.
బీజేపీ దొడ్డిదారిన వస్తున్నారని, ఆ దొడ్డిదారే వైసిపీ, జనసేన పార్టీలని అన్నారు. నా జీవితం పేదలకు అంకితమని ఇందుకోసం 24 గంటలు కష్టపడి పనిచేస్తానన్నారు. పేదరికం పూర్తిగా నిర్మూలం చేయడమే తన ఏకైక లక్ష్యం, ఆశయం అన్నారు. ఒక రాష్ట్రం కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఏకైకపార్టీ తెలుగుదేశం అన్నారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడితే, ఏకంగా 126 మంది ఎంపీలు మద్దతు ప్రకటించారని చెప్పారు. బిజెపి మనల్ని ఏమి చేయలేదని ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమన్నారు. రాష్ట్రంలో 25 ఎంపి స్థానాలను మనమే గెలుస్తామన్నారు.
బిజెపి వైసిసీపీతో పొత్తు పెట్టుకొని ఏపి లోకి దొడ్డిదారిన చొరబడటానికి చూస్తుందని, ఆ దొడ్డిదారే వైసిసీపీ, జనసేన పార్టీలని అన్నారు. బిజెపి పార్టీ వైసిసీపీ, జనసేన పార్టీలని అస్త్రాలుగా ఉపయోగించి, టిడిపిని దెబ్బతీయాలని చూస్తోందని ఆయన చెప్పారు. కానీ వారు ఎన్ని ఎత్తులు వేసిన మన దగ్గర మాత్రం ఒక బలమైన అస్త్రం ఉందని, అదే తన మీద ప్రజలకు ఉన్న నమ్మకం అని, ఆ ఓటర్లే తన బలమని ఆయన చెప్పారు. అలాగే ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు మంచి జరుగుతుందని, కాబట్టి ప్రజలందరూ కుల, వర్గ, జాతి, మత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు.