గుజరాత్ లో పీఎం మోదీ శబర్మతీ నదిలో సీప్లేన్ ప్రారంభించగా, కృష్ణా నదిలో ఏపీ సీఎం చంద్రబాబు సీప్లేన్ ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. అటు గాలిలోనూ, ఇటు నీటిపైనా ప్రయాణించగల ఉభయ చర విమానాన్ని స్పైస్ జెట్ కృష్ణా నదిలో ప్రవేశపెట్టింది. ప్రపంచమంతా అందుబాటులో ఉండే సీప్లేన్ లను ప్రకాశం బ్యారేజీ కృష్ణానదిలో నడిపిలే కొత్తదనానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పున్నమిఘాట్ లో ఏర్పాటు చేసిన సీప్లేన్ విన్యాసాలను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్లేన్లో మొత్తం 10 నుంచి 12 సీట్లు ఉంటాయి. ఈ ప్లేన్కు 300 మీటర్ల రన్వే చాలు. 2,3 అడుగుల నీరున్నా సీప్లేన్ ల్యాండ్ అవుతుంది. రయ్ మంటూ గాల్లోకి ఎగిరిపోతాయి. దేశంలోని ప్రధాన రిజర్వాయర్లు, నదులు, సరస్సుల్లో ఈ సీ ప్లేనులు అనుకూలంగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్లేన్లతో నీటిలో ఈజీగా ల్యాండ్ అవ్వచ్చు.
సీ ప్లాన్ ని ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధిలో పర్యాటకానిదే కీలక పాత్ర అన్నారు. పాపికొండలు, పోలవరం, భద్రాచలం, విశాఖ వరకు ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇక విమానాశ్రయాలతోనే 16 శాతం అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో విమానాలు ఎక్కేవారు ఎక్కువయ్యారని చెప్పారు. కృష్ణా నదిలో పున్నమి ఐలాండ్ లో దేశంలోనే అతి పెద్దదయిన ఫ్లోటింగ్ వాటర్ ఫౌంటెయిన్ ఏర్పాటు చేసిన టూరిజం శాఖను తాను అభినందిస్తున్నానని సీఎం చెప్పారు. టూరిజం పెరగాలంటే మీడియా కూడా పాజిటివ్ వార్తలను అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీలో విమానయాన అభివృద్దికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ వహ ఇస్తుందని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు హామీ ఇచ్చారు. స్పైస్ జెట్ 100 వరకు సీ ప్లేన్ లను దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతోందని పేర్కొన్నారు.
పర్యాటకులకు కనువిందు చేసేందుకు, సరికొత్త అనుభూతిని అందించేందుకు టూరిజం శాఖ సీ ప్లేన్ ను త్వరలో అందుబాటులోకి తెస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ చెప్పారు. రాష్ట్ర పర్యాటకం లోకి సీ ప్లేన్ రావడం ఎంతో ఆనందంగా ఉందని, నదీ తీరం, సముద్ర తీరం ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటర్ వేస్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, ఏపీ టూరిజం ఛైర్మన్ జయరామిరెడ్డి, ఎండి హిమన్షు శుక్లా, జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, సీపీ గౌతం సవాంగ్ , స్పైస్ జెట్ సిబ్బంది పాల్గొన్నారు.