కృష్ణా నదిలో ఘోర పడవ ప్రమాదం జరిగినా, మన అధికారుల్లో ఏ మాత్రం చలనం రాలేదు... సాక్షాత్తు ముఖ్యమంత్రి వీళ్ళ మీద అసహనం వ్యక్తం చేశారు అంటే, వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారో అర్ధం అవుతుంది.. ఒక పక్క ప్రభుత్వం అన్ని ప్రైవేటు బోటు ఆపరేటర్స్ తో చర్చలు జరిపి, కొత్త నిబంధనలు వచ్చే వరకు లైసెన్స్ రద్దు చేస్తున్నాం అని చెప్పారు... అయితే, నిబంధనలు రెడీ చెయ్యాల్సిన అధికారాలు, కనీసం ఇప్పటి వరకు ఒక రివ్యూ కూడా జరపలేదు... ఇది ముఖ్యమంత్రికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది... పెద్ద సంఖ్యలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోయినా సంబంధిత శాఖల అధికారుల్లో ఆ స్థాయి స్పందన కనిపించడం లేదని, కనీసం అందరూ కలిసి ఒక సమావేశం పెట్టుకొని చర్చించకపోవడం ఏమిటని ఆయన నిలదీసినట్లు చెబుతున్నారు....
అసెంబ్లీలో ప్రమాదం పై ప్రకటన చేసి సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ముఖ్యమంత్రి. సోమవారం రాత్రి దీనిపై కొందరు ఉన్నతాధికారులతో ఆయన మరోసారి మాట్లాడారు. సభలో తాను చేసిన ప్రకటన ఆధారంగా తదుపరి చర్యలు ఏం తీసుకొన్నారని ఆయన అడిగితే... వారు సమాధానం చెప్పలేకపోయారు. దానితో వారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ సంఘటనలో ఇరవై మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. విహారానికి వచ్చిన వారు ప్రాణాలు కోల్పోవాల్సి రావడం దారుణం. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది... మళ్లీ ఇలాంటివి జరగకుండా ఏం చేయాలన్న దానిపై తక్షణం మీలో స్పందన కనిపించాలి. నేను పిలిచి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం సీరియ్‌సగా ఉందని... ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తానని నేను సభాముఖంగా చెప్పాను. నా ప్రకటనను మీరు ఆదేశంగా తీసుకోవాలి. కానీ ఎవరికి వారు అదేదో మిగిలిన వారి పని అన్నట్లు ఉండిపోయారు. మీ అందరి పని కూడా నేనే చేయాలా? మీకెవరికీ బాధ్యత లేదా’ అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.
నదిలో పర్యాటకుల కోసం పడవ నడపాలంటే పర్యాటక శాఖ, జల వనరుల శాఖ, అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖ వంటి ఐదారు శాఖలు అనుమతులు ఇవ్వాల్సి ఉందని, దీనితోపాటు ఎప్పటికప్పుడు ఆ పడవల స్థితి, అందులోని రక్షణ ఏర్పాట్లపై తనిఖీలు ఉండాలని ఆయన చెప్పారు. ‘ఇవి నేను కొత్తగా పెట్టిన నిబంధనలు కావు. చాలా కాలం నుంచి అమల్లో ఉన్నాయి. కానీ వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. నడుస్తున్న పడవలకు ఈ అనుమతులు ఉన్నాయా లేదా అన్నది కూడా ఎవరూ చూడటం లేదు. ఇప్పటికైనా ఈ శాఖల అధికారులంతా కూర్చోండి. ఉన్న నిబంధనలు ఏమిటో చూడండి. ఈ ఘటన నేపథ్యంలో అందులో మార్పుచేర్పులు ఏమైనా చేయాలా అన్నది ఆలోచించండి. క్రమం తప్పకుండా తనిఖీలు చేయాల్సిన బాధ్యత ఎవరిదో తేల్చండి. ప్రాణాలు ఎవరివైనా అమూల్యమైనవే. మరోసారి ఇలాంటివి జరగకుండా చూడండి. ఇది తక్షణం జరగాలి. మరోసారి నాతో చెప్పించుకోవద్దు’ అని ఆయన అన్నారు. వెంటనే ఈ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఒక నివేదిక ఇస్తామని అధికారులు సీఎంతో చెప్పారు. దానికి ఆయన అంగీకరించలేదు. ఆ నివేదికతోపాటు ఆ సమావేశంలో పాల్గొన్న అధికారులంతా తన వద్దకు రావాలని, ఏం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారో తనకు చెప్పాలని ఆదేశించారు. దీంతో బుధవారం ఉదయం వివిధ శాఖల అధికారుల సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు.