ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పై ఆందోళన వ్యక్తం చేసారు. ముందుగా జగన్ ప్రభుత్వానికి, ఆరు నెలల వరకు సమయం ఇద్దామని, వారి విధానాలు చూసి తరువాత స్పందిద్దామని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కాని రోజు రోజుకీ పాలన గాడి తప్పటం, ప్రజల ఇబ్బందులు ఎక్కువ కావటంతో, సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేందుకు సిద్ధపడ్డారు. రాష్ట్రంలో ఒక అక్క కూల్చివెతలు, తెలంగాణాకు అప్పగింతలు, ఇలా ఒక వైపు ఉంటే, మరో వైపు విత్తనాల కొరత, కరెంట్ కోతలు, పధకాలు నిలిపుదల లాంటి వాటితో సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. వీటి పై చంద్రబాబు స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి నెలరోజుల పాలన పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ప్రజలను ఇబ్బంది పెడుతున్న విధానాన్ని తూర్పారపట్టారు.
గురువారం ఆయన పార్టీ ఆఫీస్ లో మీడియాతో చిట్ చాట్ చేసారు. తాము పాలించిన గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా విత్తనాలు, ఎరువులు సమస్య లేకుండా చూసి, రైతులకు ఇబ్బంది లేకుండా చేసామని గుర్తు చేసారు. రైతులకు విత్తనాలు అందకుండా, వాళ్ళు రోడ్డు ఎక్కి ఆందోళన చెయ్యటానికి, తెలుగుదేశం పార్టీ కారణమని వైసీపీ నాయకులు చెప్పటం విడ్డూరంగా ఉందని చంద్రబాబు అన్నారు. వైసీపీ పార్టీ ఏది చెప్పినా, ప్రజలు నమ్ముతారు అనుకుంటుందని, ప్రజలు అమాయకులు కాదని అన్నీ అర్ధం చేసుకుంటారని ఆన్నారు. తాము అధికారంలోకి వచ్చే సరికి కరెంటు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది అని, మేము వచ్చిన నెలరోజుల్లో కరెంటు కోతలు లేకుండా చేశామని, కానీ, వైసీపీ పార్టీ వచ్చిన నెల రోజుల్లోనే కరెంట్ కోతలు మళ్లీ మొదలయ్యాయి అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరెంట్ కోతల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు.