రాష్ట్రంలో వాతావరణం రోజురొజుకూ వేడెక్కుతున్నట్లే సార్వత్రిక ఎన్నికల వేడికూడా రాజుకుంటోంది. తెలుగుదేశం పార్టీ నుండి కొంతమంది నాయకులు వలస వెళ్ళి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కండువాలు కప్పుకుంటున్న నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు నేతృత్వంలో శనివారం పోలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈసమావేశంలో పార్టీలోని ఆశావహులతో పాటు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రికి అందిన సర్వే నివేదిక లపై ప్రధానంగా చర్చ జరిగింది. సర్వేలు, బుజ్జగింపు లపై కసరత్తు ముగించి ఈ నెలాఖరులోగా అభ్యర్థుల జాబితా ఖరారు చేసే లక్ష్యంగా పొలిట్‌బ్యూరోలో నిర్ణయాలు తీసుకుంది. అలాగే, పార్టీ విధివిధానాల పట్ల అపనమ్మకం, అసహనం వున్న నేతలకు సీరియస్ వార్నింగ్‌లు ఇచ్చేందుకు అధినేత చంద్రబాబు సమాయత్తం అయినట్టు తెలిసింది. అవకాశవాదులు తమ వైఖరి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే సంకేతాలిచ్చారు.
పార్టీపట్ల నమ్మకం లేనివారు పార్టీని వీడి గౌరవంగా వెళ్ళవచ్చని, పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేలా వ్యవహరిస్తే సహించేది లేదని గతంలో పలు సందర్భాల్లో అధి నేత చంద్రబాబు హెచ్చరించారు. అయితే ఈ రోజు జరిగిన టెలి కాన్ఫరెన్స్ లో, ఇదే విషయం స్పష్టం చేసారు. ఐవీఆర్‌ఎస్ ద్వారా అందరి అభిప్రాయాలను స్వీకరిస్తున్నామని, ఎన్నికల కౌంట్ డౌన్ ప్రారంభమైందని నేతలతో సీఎం అన్నారు. ఉత్తమ బృందాన్ని ఎంపిక చేస్తున్నామని చెప్పారు. అభ్యర్థులను కూడా త్వరలోనే ప్రకటిస్తామని సీఎం వెల్లడించారు. ఎంతటి వారైనా సరిగ్గా పని చేయని వారు ఉంటే, వారిని తప్పించేస్తున్నా అని తెగేసి చెప్పారు. మొహమాటమే లేదని, సిఫార్సులు కూడా పట్టించుకోనని, ప్రజాభిప్రాయం లేని వారికి సీటు ఇచ్చే పని లేదని చెప్పారు.
వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళిపొండి అంటూ నిర్మొహమాటం చెప్పటంతో, అందరూ అవాక్కయ్యారు. చంద్రబాబు ఇంత ఖటినంగా మాట్లాడటంతో నేతలు కూడా అవాక్కయ్యారు. మరో పక్క, వలసల కారణంగా పార్టీ ప్రతిష్టకు ఎటువంటి భంగం కలుగకుండా అప్రమత్తతో వ్యవహరించాలని అధిష్టానం భావిస్తున్నది. ప్రజలలో ఎటువంటి సందేహాలకు తావులేకుండా ప్రగతి, సంక్షేమ పథకాలపై పెద్దెత్తున ప్రచారం చేసేలా నేతలకు దిశానిర్దేశం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో వ్యవస్థాగత లోపాలను, అసమ్మతి జ్వాలలను కట్టడి చేసేందుకు తగిన వ్యూహాన్ని ఖరారు చేసారు. గడచిన నాలుగున్నరేళ్లలో తెలుగుదేశంపార్టీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లినట్లయితే పార్టీకి పరాజయం అనేది ఉండదన్న ఉద్దేశంతో నేతలకు దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు.