చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని చంద్రగిరి నియోజకవర్గం పై దృష్టి పెట్టటంతో, రాజకీయం వేడెక్కింది. ఈసారి ఎలాగైనా చంద్రగిరిలో తెలుగుదేశం జెండా ఎగురవేయాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మల్యేగా ఉన్న చెవిరెడ్డి బాస్కర్రెడ్డిని ధీటుగా ఎదుర్కొనే నేత కోసం చంద్రబాబు అన్వేషించారు. అన్నీ కోణాల్లో చుసిన తరువాత, జిల్లాలో యువనేత, టీడీపీ జిల్లా అధ్యక్షుడయిన పులివర్తి నానిని చంద్రగిరి అభ్యర్థిగా బాబు చంద్రబాబు ప్రకటించారు. ఈ పరిణామం తెలుగుదేశం నేతల్లోనే కాదు, చిత్తూరు జిల్లా రాజకీయ వర్గాల్లోనే సంచలనం రేపింది. ఇక్కడ సీనియర్ నేత అయిన గల్లా అరుణకుమారి వచ్చేఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీకి అయిష్టంగా ఉండటంతో, కొత్త అభ్యర్థిని పోటీకి దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అన్నీ ఆలోచించిన బాబు, చివరికి పాకాల మండలం పులివర్తివారిపల్లెకు చెందిన పులివర్తి నాని అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారు.
రాజకీయ కుటుంబానికి చెందిన నాని వార్డు మెంబరు స్థాయి నుంచి పైకి వచ్చారు. 2001లో పులివర్తివారిపల్లెకు సర్పంచ్గాఈయన ఎన్నికయ్యారు. టీడీపీ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా టీడీపీ బలోపేతానికి అలుపెరుగని కృషిచేశారు. ఈ తరుణంలోనే ఆయన పై చంద్రబాబు దృష్టి పడింది. పార్టీ కార్యాలయంలోనే పులివర్తి నాని ఎక్కువ సమయం గడుపుతారు. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. సమస్యల పరిష్కారం కోసం పాటు పడతారు. ఈ అర్హతల అన్నీ చూసిన, చంద్రబాబుకు నాని పై అభిమానం పెరిగింది. ఆయన అయితేనే చెవిరెడ్డి పై పోటీచేసి గెలవగల అభ్యర్థి అని చంద్రబాబు భావించారు. బాబు తన పేరు ప్రకటించిన తర్వాత పులివర్తి నాని చంద్రగిరిలో తన మార్క్ రాజకీయం ప్రారంభించారు.
నియోజకవర్గంలో చిన్నాచితకగా ఉన్న అసంతృప్తులను కూడగడుతున్నారు. వారిని ఒక తాటిపైకి తీసుకువస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు. ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పనిలో వేగం పెంచారు. ఇది వరకు చంద్రగిరిలో ఏ నాయకుడు ఇంతగా పనిచేసింది లేదట. అన్ని వర్గాలను కలుపుకు వచ్చేందుకు కూడా నాని ప్రయత్నిస్తున్నారు. సూటిగా చెప్పాలంటే ఎన్నికల ప్రచారంలోకే ఆయన దిగేశారు. ప్రచారరథాన్ని సైతం సిద్ధం చేసుకుని దూకుడు పెంచారు. మాజీమంత్రి, సీనియర్ నేత గల్లా అరుణకుమారి సహకారం తీసుకుంటున్నారు. సందర్భం దొరికినప్పుడల్లా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యవహార శైలి పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ కారణంగా నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల కాక రేగుతోంది. అందుకే చంద్రగిరి రాజకీయాల్లో ప్రస్తుతం పులివర్తి నాని చర్చనీయాంశంగా మారారు. చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందో లేదో తెలియాలంటే, ఎన్నికల వరకు ఆగాల్సిందే.