చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుంచి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి హవా కొనసాగుతుంది. బలమైన ప్రత్యర్ధి లేకపోవటంతో, ఆయనకు అడ్డు లేకుండా పోయింది. దీంతో చంద్రబాబు, ఈ నియోజకవర్గం పై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి హవా కొనసాగకుండా ఉండటానికి, సరి కొత్త వ్యూహంతో ముందుకొచ్చారు. యోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఇన్‌చార్జిగా మంత్రి అమరనాథరెడ్డి మరదలు అనూషారెడ్డిని నియమించ డానికి అధినేత నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ఆమెనే బరిలోకి దించుతున్నట్టు స్పష్టమైన సంకేతాలిచ్చేశారు.
దీంతో పదేళ్లుగా పుంగనూరును పెట్టని కోటగా మలచుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థిని ఢీకొనడం అనివార్యమవుతోంది. పదేళ్ల విరామం అనంతరం పుంగనూరు బరిలో తిరిగి కెళవాతి కుటుంబం అడుగుపెట్టడం ఖాయమన్న సమాచారం నియోజకవర్గ రాజకీయాల్లో ఒక్కసారిగా కాక పుట్టిస్తోంది. పదేళ్లుగా మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యక్తిగతంగా పెట్టని కోటగా మారిన పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీకి పూర్వవైభవం సాధించి తీరాలని అధిష్ఠానం పట్టుదలతో ఉంది.
ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి పెద్దిరెడ్డి ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి వ్యూహరచన చేసింది. దానికనుగుణంగా మంత్రి అమరనాథరెడ్డి సోదరుడు శ్రీనాథరెడ్డి సతీమణి అనూషారెడ్డి పేరు ఖరారు చేసింది. ఈనెల ప్రారంభంలో రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పార్టీ సమీక్షలో అధినేత సీఎం చంద్రబాబు సూచనప్రాయంగా ఈ నిర్ణయాన్ని ముఖ్యనేతలకు వెల్లడించారు. ఇటీవల తిరుమలకు వచ్చిన సందర్భంలో తనను కలిసిన మంత్రి అమర్ సోదరుడు శ్రీనాథరెడ్డితో.. దంపతులిద్దరూ విజయవాడ వచ్చి కలవాలని సీఎం సూచించారు. ఆ మేరకు ఆదివారం శ్రీనాథరెడ్డి, అనూష విజయవాడ వెళ్లి అధినేతను కలిశారు. పుంగనూరు పార్టీ ఇన్‌చార్జిగా నియమిస్తామని, వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఇస్తామని అనూషకు చెప్పిన చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని స్పష్టం చేశారు.