తెలంగాణ ప్రభుత్వం హద్దులు దాటి ప్రవర్తిస్తోందని, ఇలాగే వ్యవహరిస్తే రాష్ట్రాలకు పరిశ్రమలు రావని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మంగళవారం ఆయన పలువురు టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీడీపీ డేటానే టీఆర్‌ఎస్ దొంగిలించే ప్రయత్నం చేసిందన్నారు. డేటా విషయంలో సిల్లీ వాదనలు చేస్తున్నారని, ఏపీ చేస్తున్న మంచిపనులు, కేంద్రం, వైసీపీ చేస్తున్న తప్పుడు పనులపై చర్చ జరగకుండానే ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని, విశాఖ జోన్ విషయంలో కేంద్రం చేసిన అన్యాయంపై చర్చ జరగకుండా డేటా అంశాన్ని తెరపైకి తెచ్చారని చంద్రబాబు అన్నారు. అహంభావంతో కేసీఆర్, ఫ్రస్టేషన్‌తో జగన్ దుర్మార్గాలు చేస్తున్నారని, వ్యక్తికైనా, సంస్థకైనా డేటా అనేది ఒక ఆస్తి అని, ఆస్తులకే హైదరాబాద్‌లో రక్షణ లేదన్నారు.
అహంకారం నెత్తికెక్కి తెరాస విపరీత చేష్టలకు పాల్పడుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు. ఏ వ్యక్తికైనా, సంస్థకైనా సమాచారమే కీలక ఆస్తి అని.. అలాంటి ఆస్తికి హైదరాబాద్‌లో రక్షణ లేకుండా పోయిందని సీఎం మండిపడ్డారు. పిల్లచేష్టలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టం కలిగిస్తున్నారని.. ఎవరైనా సమాచారాన్ని ఇకపై హైదరాబాద్‌లో పెడతారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. వాళ్లకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకొని హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏ పార్టీకి లేని సాంకేతిక తెదేపా సొంతమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ 24 ఏళ్లు కష్టపడి కార్యకర్తల సమాచారం సేకరిస్తే.. దానిని దొంగిలించి వైకాపాకి ఇచ్చారని సీఎం దుయ్యబట్టారు. ప్రభుత్వ సమాచారమని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తెదేపా సమాచారం కొట్టేసి పార్టీపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
మోదీ, కేసీఆర్, జగన్ ముసుగు తీసి ప్రచారం చేయాలని.. ప్రజలే మీ అరాచకాలకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కేసీఆర్‌కు సామంత రాజుగా జగన్ మారారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ని సామంత రాజ్యం చేయాలనేదే కేసీఆర్ కుట్ర అని ఆరోపించారు. జగన్‌ను లొంగదీసుకుని ఏపీపై దాడులకు తెగబడ్డారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మూలాలపై దాడులు చేయడం హేయమైన చర్య అని సీఎం మండిపడ్డారు. అధికారంతో ఏదైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఫారమ్ 7 దుర్వినియోగం చేయడం నేరమని పేర్కొన్నారు. నేరస్థుల ఆలోచనలు ఎప్పుడూ నేరాలపైనే ఉంటాయని చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరులో నాలుగు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే జగన్ అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు.