లాక్ డౌన్ కాలంలో, వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అన్ని సౌకర్యాలు కల్పించిన సోనూ సూద్, ఈ సారి రైతు గుండె చప్పుడు ఆలకించి, మరోసారి తన ఉదారత చాటుకున్నారు. కాడెద్దులు అద్దెకు తెచ్చినే స్తోమత లేక, తన ఇద్దర కుమార్తెలతో పొలం దున్నిస్తూ, సాగు చేసుకున్న చిత్తూరు జిల్లా రైతు నాగేశ్వర రావు కష్టాలను, సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న సోనూ సూద్, వేగంగా స్పందించారు. రైతులు దేశానికి వెన్నుముక అని చెప్పిన సోనూ సూద్, గంటల వ్యవధిలోనే, ట్రాక్టర్ కొని ఆ రైతుకు అంద చేసి, అందరినీ ఆశ్చర్యపరిచారు. చిత్తూరు జిల్లా, కేవీ పల్లి మండలం, మహాల్రాజ పల్లికి చెందిన నాగేశ్వరరావు అనే రైతు, పొలం దున్నేందుకు సాయంగా, అతని ఇద్దరు కుమార్తెలు కాడెద్దులుగా మారిన వీడియో వైరల్ అయ్యింది. కరోనా ప్రభావంతో అద్దెకు ట్రాక్టర్లు దొరక్క, ఎక్కువ డబ్బులు పెడితే కానీ, కూలీలు వచ్చే పరిస్థితి లేకపోవటంతో, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, రైతు నాగేశ్వరావు కష్టాలు తీర్చారు సోనూ సూద్.
అయితే ఈ విషయం తెలిసిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పందించారు. సినీ నటుడు సోనూ సూద్ కు ఫోన్ చేసి చంద్రబాబు అభినందించారు. చిత్తూరు జిల్లా సంఘటన పై మీరు స్పందించిన తీరు, ఆ కుటుంబానికి ట్రాక్టర్ అందించిన తీరుని, అభినందిస్తున్నానని, మీ చర్యలు మరి కొంత మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. రైతు నాగేశ్వరరావు కుమార్తెల చదువు బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ వారు ఎంత వరకు చదువుకుంటే, అంత వరకు చదివిస్తుందని చెప్పారు. దీనికి స్పందించిన సోనూ సూద్, చంద్రబాబుకు అభినంధనలు తెలిపారు. మీ చర్యలతో, ఎంతో మందికి మంచి భవిష్యత్తు ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు. మీరు ఎంతో మందికి ఆదర్శంగా కొనసాగాలని, త్వరలోనే వచ్చి మిమ్మల్ని కలుస్తానని అన్నారు.