అమరావతిని ఏదో ఒక పరిపాలన నగరంగా కాకుండా ఆర్థికాభివృద్ది కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో సమ్మిళిత వృద్ధి సాధించాలన్నదే తమ ప్రయత్నమని, సమాజంలో ప్రతి ఒక్కరికీ అమరావతి అవకాశాలు కల్పించాలన్నది తమ అభిమతమని వివరించారు. నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి పెట్టుబడులు, సాంకేతిక సహకారాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన ఆదివారం ఉదయం ఆరంభమైంది. ముందుగా ముఖ్యమంత్రి సింగపూర్ జాతీయాభివృద్ధి మంత్రి (Minister for National Development) లారెన్స్ వోంగ్ తో భేటీ అయ్యారు. నవ్యాంధ్ర రాజధానిలో 30 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు కొనసాగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. తాము రూ.30 వేల కోట్ల విలువైన టెండర్ల ప్రక్రియను చేపట్టామని వివరించారు.
రాజధాని అమరావతి ప్రజారాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన ఇబ్బందులు అధిగమించేందుకు పెద్దఎత్తున అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఉభయ దేశాల మధ్య పరస్పర సహకారానికి, సౌహార్ద సంబంధాలకు ఇది సదవకాశమని ముఖ్యమంత్రి అన్నారు. రాజధాని అభివృద్ధికి తమ ప్రణాళికలు వాస్తవరూపం ధరించేందుకు సాంకేతికతను సాధనంగా తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో భారత్ కు ప్రాతినిధ్యం ఉండాలని, అందులో అమరావతిని ప్రపంచస్థాయి 5 అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రయత్నమని చంద్రబాబు తెలిపారు. అమరావతి సమీపంలో ఇప్పటికే అభివృద్ధి చెందిన రెండు పెద్ద నగరాలున్నాయన్నారు. అమరావతిని క్రమానుగతంగా అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఇష్టం లేని విభజన ఎదుర్కొని కసిగా అభివృద్ధి చెందిన సింగపూర్ తమకు ఆదర్శమని, సింగపూర్ ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తుందని, రాజధాని లేని తమకు నూతన రాజధాని నిర్మాణానికి బృహత్తర ప్రణాళికను రికార్డు సమయంలో తయారు చేసి ఇచ్చిన సింగపూర్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. నగరాభివృద్ధి దశలవారీగా ఉంటుందని వివరించారు. అమరావతిలో రాజధాని నిర్మాణంకోసం భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన పనిలో నిమగ్నమయ్యాయమని, ఇందుకోసం రూ.40 నుంచి 50 వేల కోట్లు అవసరమవుతాయన్నారు.
సింగపూర్ నేషనల్ డెవలప్మెంట్ మినిస్టర్ వోంగ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రణాళికలు తమనెంతో ఆకట్టుకున్నాయన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి గ్రీన్‌ఫీల్డ్ సిటీ ఎన్నో అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. అమరావతిలో ఇక జన సంఖ్య పెరగాలన్నారు. ఇటీవల సింగపూర్ మంత్రులు పలువురు భారత్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి సంతోషం వ్యక్తంచేశారని వోంగ్ గుర్తు చేశారు. అమరావతి అభివృద్ధి చెందుతున్న తీరు బావుందని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు భూసమీకరణ కింద 33 వేల ఎకరాల భూములివ్వటం అపూర్వ విషయమన్నారు. ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణ విధానం అందరికీ మార్గదర్శకమని అభివర్ణించారు. అమరావతి నగర నిర్మాణంలో నవీన సాంకేతికత, వినూత్న విధానాలను అమలు చేయడానికి తాము తప్పకుండా సహకరిస్తామని, హరిత నగరంగా తీర్చిదిద్దే కృషిలో భాగస్వామ్యం తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
సింగపూర్‌లో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ నగరాల సదస్సు(Global cities summit) ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలపై అందరిలో అవగాహన పెంచేందుకు తప్పకుండా దోహదపడుతుందని తమ విశ్వాసమని, అంతేకాదు, అనేక వినూత్న పెట్టుబడి భాగస్వామ్యాలకు ఈ సదస్సు వేదికగా నిలవబోతోందని చెప్పారు. అమరావతి అభివృద్ధికి నిర్ధిష్ట కాల పరిమితులను నిర్ణయించుకోవడం అవసరమని, ఇప్పటికే అక్కడ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో త్వరలో గణనీయమైన మార్పు తప్పకుండా కనిపిస్తుందని చెప్పారు. ఇతర దేశాలతో సింగపూర్ సంబంధాలన్నీ నిర్ణీత పద్ధతిలో వుంటాయన్నారు. అయితే భారతదేశం విషయానికి వస్తే అక్కడ పరిస్థితులకు అనుగుణంగా సహకారం అందిస్తున్నామని, ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌తో తమ సంబంధాలు దృఢంగా ఉంటాయని, తాము త్వరలో భారత్ వచ్చినప్పుడు అమరావతిని తప్పక సందర్శిస్తామని వివరించారు.