తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ తనను పర్సనల్ గా టార్గెట్ చేయడా,న్ని ఆంధ్రప్రదేశ్‌లో తనకు రాజకీయంగా కూడా అనుకూలంగా మలచుకోవడానికి చంద్రబాబు పావులు కదుపుతున్నారు. చంద్రబాబు ఎలాగూ, కెసిఆర్ స్థాయికి దిగాజారి మాట్లాడలేదు, అందుకే ఈ పరిస్థితులని తనకు అనుకూలంగా మారుస్తున్నారు. తెలుగువారు కలిసి ఢిల్లీని డీ కొందామని కెసిఆర్ కు చెప్పినా, ఆయన బీజేపీతో అంట కాగుతూ, కాదన్నందుకే కాంగ్రెస్‌తో కలవాల్సి వచ్చిందని చంద్రబాబు తరుచూ చెప్తున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్‌తో కలవడం వల్ల కేసీఆర్ తనను శత్రువుగా పరిగణిస్తారని చంద్రబాబుకు తెలియనిది కాదు. ఈ పరిణామం ఏపీలో ఎన్నికలు జరిగే నాటికి ప్రత్యర్థుల సంఖ్యను పెంచడమే కాకుండా వారిని సంఘటితం చేసే ప్రమాదం లేకపోలేదని కూడా చంద్రబాబు అంచనా వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు.
ప్రధాని మోదీ డైరెక్షన్‌లో కేసీఆర్, జగన్మోహన్‌రెడ్డి, పవన్ కల్యాణ్ నడుచుకుంటున్నారనీ, అందరూ ఏకమై చంద్రబాబుని వేధిస్తున్నారనే అభిప్రాయం ఏపిలో చాలా మందికి ఉంది. ఎన్నికలు జరగబోయే వేళ ఐటి అధికారులు అమరావతి మీద విరుచుకుపడి, సోదాలకు పాల్పడటం టిడిపిని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మద్దతుదారులను వేధించడంలో భాగమేనన్న అభిప్రాయం ఏపీ ప్రజలలో వ్యాపిస్తోంది. దీనికి తోడు ఏపి బీజేపీ నాయకుల మాటలు.. చంద్రబాబుకు చుక్కలు చూపిస్తాం.. చంద్రబాబుని దింపివేస్తాం, అంటూ జీవీఎల్ నర్సింహారావు లాంటి వారు, ఇటీవలి కాలంలో ఇచ్చిన వార్నింగ్ లు కూడా ప్రజల్లో అనుమానాలు మరింత బలపడేలా చేశాయి. కేసులు పెడతాం, జైలుకు పంపుతాం వంటి హెచ్చరికలు ఎలా ఉన్నా, అవి మాత్రం రాజకీయంగా చంద్రబాబుకు ఉపయోగపడుతున్నాయి.
ఎన్నికలు సమీపించేనాటికి చంద్రబాబుకి వ్యతిరేకంగా, జగన్, పవన్, కెసిఆర్, బీజేపీ ఒక్కటవుతున్నారని, ఇప్పటికే ఏపి ప్రజలు భావిస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని బలపరిచే విధంగా, చంద్రబాబు కూడా ఆయన పని ఆయన చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి, పవన్ కల్యాణ్‌ను ఏకం చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తారని చంద్రబాబు అనుమానిస్తున్నారు. అదే జరిగితే తీసుకోవాల్సిన విరుగుడు చర్యల పై ఆయన దృష్టి కేంద్రీకరించారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులను సంఘటితం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగే నాటికి జగన్మోహన్‌రెడ్డి, పవన్ కల్యాణ్‌లను ఆత్మరక్షణలోకి నెట్టాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. బీజేపీకి పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరించే ఎవరైనా రాష్ట్ర ద్రోహులుగా ఉన్న పరిస్థితిని, చంద్రబాబు మరింతగా ప్రజల్లో నాటే ప్రయత్నం చేస్తున్నారు.