మోదీ బలమైన నాయకుడని, ఆయన ఎంత నిరంకుశంగా పనిచేసినా ఆయనను ఎదుర్కొనే శక్తి ప్రతిపక్షాలకు లేదనే అభిప్రాయం నిన్నమొన్నటివరకూ ఉండేది. రాఫెల్ కుంభకోణంపై విరుచుకుపడుతున్న తీరుతో రాహుల్ గాంధీ గ్రాఫ్ కొంత పెరిగినప్పటికీ, ఆయనకు సొంతంగా కాంగ్రె్‌సను గెలిపించేశక్తి లేదని జనం భావించే వారని పరిశీలకులు అంటున్నారు. అంతేకాక ప్రతిపక్షాలు ఒకదానికొకటి మాట్లాడుకునే పరిస్థితి లేకపోవడం, విభిన్నమైన ప్రకటనలు చేస్తుండటంతో వారు ఏకమయ్యే అవకాశాలే లేవనే అంచనాకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా ఒకింత దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ సమయంలో చంద్రబాబు ఎంటర్ అయ్యారు.
ఒక్కొక్కటిగా దాదాపు 15 పార్టీలకుపైగా నేతలు చంద్రబాబు ఆలోచనలతో ఏకీభవించి జాతీయ స్థాయిలో ఒకే వేదికపై సమావేశం కావడానికి అంగీకరించారు. చంద్రబాబు వ్యూహం ప్రకారం... ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందే ప్రతిపక్షాలు ఢిల్లీలో ఒక వేదిక గా ఏర్పడతాయి. వివిధ రాష్ట్రాల్లో సభలు, ర్యాలీలు నిర్వహిస్తాయి. రాష్ట్రాల ఎన్నికల తర్వాత జనవరిలో మమతా బెనర్జీ కోల్‌కతాలో ఏర్పాటు చేసే ర్యాలీతో అంతా ద్విగుణీకృత ఉత్సాహంతో ఐక్యమవుతారని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీల అధినేతలు, ముఖ్యుల సదస్సు త్వరలో నిర్వహించడం ద్వారా ప్రతిపక్ష ఐక్యతపై బలమైన సంకేతాన్ని ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. దీపావళి తర్వాత ఢిల్లీలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది.
ఈ సమావేశంలోనే భవిష్యత్ కార్యాచరణపై ఒక రోడ్ మ్యాప్‌ను కూడా ఖరారు చేయొచ్చు. దీనిపై ఇప్పటికే పవార్, ఫరూక్ అబ్దుల్లా తదితరులతో చంద్రబాబు చర్చలు జరిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యులతో శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభించారు. తొలి సమావేశం విజయవాడలోనే జరిగింది. తర్వాత ఒక్కోసారి ఒక్కో రాష్ట్రంలో నిర్వహించారు. అప్పట్లో ఇవి బాగా ప్రసిద్ధి పొందాయి. అదే తరహా వ్యూహం ఈసారి కూడా అమలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.