ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తీరు చూస్తే, అసలు ఇది ప్రజా స్వామ్యమేనా అనిపిస్తుంది. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం. రాజకీయ క్రీడా అడతారు, అనేక వర్గాలను దగ్గర చేసుకుంటారు. హామీలు ఇస్తారు. ఏమి చేస్తామో చెప్తారు. ప్రత్యర్ధి కంటే తాను ఎలా బాగా చేస్తాడో చెప్తారు. ప్రజల ముందుకు వెళ్తారు. తరువాత, ప్రజలే తాము ఎవరికీ ఓటు వేయాలో నిర్ణయం తీసుకుంటారు. తరువాత ఎన్నికలు జరుగుతాయి, ఫలితాలు వస్తాయి, ఎవరు గెలిస్తే వారు ప్రజా సేవలో ఉంటారు. అయితే జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత ఎన్నికల ప్రక్రియనే మార్చేసారు. ఇది వరకు ఎన్నికల్లో అక్రమాలు అంటే రిగ్గింగ్ ఒక్కటే మనకు తెలుసు. ఇప్పుడు అలా కాదు, అసలు అభ్యర్ధి నామినేషన్ వేయాలి అంటేనే భయపడే స్థితికి తీసుకుని వచ్చారు. సామ దాన భేద దండోపాయాలు ఉపయోగిస్తున్నారు. అధికార ఒత్తిడి చేస్తున్నారు. సాహసించి ఎవరైనా నామినేషన్ వేయటానికి ముందుకు వస్తే, నామినేషన్ కాగితాలు లాక్కుపోతారు. అది దాటి ముందుకు వెళ్తే, నామినేషన్ పరిశీలన స్థాయిలోనే ఏదో ఒక కారణం చెప్పి తిరస్కరిస్తారు. ఎన్నికల ప్రచారంలో దా-డు-లు చేస్తారు. కిడ్నాప్ లు చేస్తారు. అక్రమ అరెస్ట్ లు చేస్తారు. ఇన్ని దాటుకుని ముందుకు వెళ్తే, ప్రజలను ప్రలోభాలు పెడతారు.
ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారని తెలిస్తే, ఓట్లు తీసి వేస్తారు. బస్సులు ఏసుకుని వచ్చి, దొంగ ఓట్లు వేయిస్తారు. ఇక్కడ కూడా తేడా కొడితే, ఎన్నికల ఫలితాల రోజు లైట్ ఆపేసి, తాము చెప్పిన అభ్యర్ధిని ప్రకటించమని చెప్తారు. నామినేషన్ వేసే దగ్గర నుంచి, ఇవన్నీ తట్టుకోవాలి అంటే, ఊళ్ళలో ఉండే వారికి అయ్యే పనేనా ? అందుకే ఏదో ఒక స్థాయిలో రాజీ పడిపోతారు. కానీ ఎదురోడ్డి పోరాడే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ సారి 12 మునిసిపాలాటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి మాత్రం టిడిపి ఊరికే వదిలి పెట్టలేదు. 328 స్థానాలు ఉంటే 322 నామినేషన్లు వేయించింది. అంతే కాదు, నామినేషన్లు పరిశీలన టైంలో, కాగితాలు సరిగా లేవని చెప్పి, నామినేషన్ తిరస్కరిస్తారని సమాచారం రావటంతో, ఆ నామినేషన్ పత్రాలు అన్నీ, కలక్టర్, ఈసీ, ఆర్ఓ కి మెయిల్ చేయటమే కాకుండా, అవన్నీ సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేసారు. ఇక పోటీ ఒక్కటే మిగిలింది. ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల్లో నామినేషన్ వేయటానికి కూడా ఒక రాజకీయ పార్టీ ఇంతలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంతగా పోరాటం చేసి ఎన్నికల వరకు వెళ్ళిన టిడిపి, ఎన్నికల్లో ఎలా పోరాడుతుందో చూడాలి.