సరిగ్గా నాలుగునెలల క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం జరిగిందో ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవే సీన్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వాగ్దాడులు పునరావృతమవుతున్నాయి! నాడు తెలంగాణ సీఎం కేసీఆర్.. మహాకూటమిలోని తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని సెంటిమెంటుతో ఓట్ల పంట పండించుకుంటే నేడు ఏపీలో చంద్రబాబూ అదే అస్త్రాన్ని ప్రయోగించే పనిలో ఉన్నారు. అప్పటి ప్రచారానికీ.. ఇప్పటి ప్రచారానికీ పోలికలను పరిశీలిస్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబుని టార్గెట్ చేసిన కేసీఆర్.. ‘కాంగ్రెస్ నేతలకు బీఫారాలు అమరావతి నుంచే ఇస్తున్నారు. మహాకూటమిని గెలిపిస్తే అమరావతి నుంచి పరిపాలన సాగుతుంది’ అని ఆరోపించా రు. ఇప్పుడు ఏపీలో టీడీపీ కూడా కేసీఆర్ ఆదేశాలతోనే జగన్ అభ్యర్థులకు బీఫారాలిస్తున్నారని.. వైసీపీ గెలిస్తే పాలన హైదరాబాద్ నుంచే సాగుతుందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
‘తెలంగాణలో బలహీన ప్రభుత్వం కోసం చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు’ అని ప్రచార సమయంలో కేసీఆర్ విమర్శించారు. ఇక్కడ బాబు అదే రీతిలో జగన్ను గెలిపించడం ద్వారా ఏపీలో బలహీన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే కుట్ర కేసీఆర్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ‘చంద్రబాబు మోచేతి నీళ్లు తాగాలా?’ అని కేసీఆర్ నాడు ఆగ్రహంగా అంటే.. ‘కేసీఆర్కు బానిసలుగా బతకాలా’ అని బాబు నిలదీస్తున్నారు. బాబు తెలంగాణకు అన్యాయం చేశాడని కేసీఆర్ ఆరోపిస్తే.. కేసీఆర్ ఆంధ్రకు అన్యాయం చేసేందుకే చూస్తున్నారని బాబు మండిపడుతున్నారు. రెండు చోట్లా ముఖ్యమంత్రుల తనయుల పాత్రపై చర్చ జరుగుతోంది. అక్కడ కేటీఆర్ సిరిసిల్ల నుంచీ పోటీచేయగా.. ఇక్కడ లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరూ నేతన్నల ప్రాబల్యం అధికంగా ఉండే నియోజకవర్గాల నుంచే పోటీ చేయడం గమనార్హం.
ఈ కామన్ పాయింట్లతో రెండు రాష్ట్రాల ఎన్నికల మధ్య ఉన్న ఒకే తేడా ఏంటంటే.. అక్కడ టీడీపీ నేరుగా పోటీ చేసింది! ఇక్కడ టీఆర్ఎస్ ఆ ధైర్యం చేయలేక తెరవెనుక రాజకీయం చేస్తోందన్నది విశ్లేషకుల మాట. బాబు ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొని తాను చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పి ఓట్లు అడగ్గా.. ‘ఏపీ రాజకీయాల్లో మేమూ వేలుపెడతాం’ అన్న టీఆర్ఎస్ నేతలెవరూ ఇక్కడ కనిపించట్లేదని వారు గుర్తుచేస్తున్నారు. ఇక మరో పాయింట్ ఏంటి అంటే, చంద్రబాబు ఎప్పుడూ తెలంగాణా ప్రజలని, అక్కడ ప్రాంతాన్ని కించ పరచలేదు. కాని కేసీఆర్ మాత్రం, ఆంధ్రా వాళ్ళు తినే తిండి దగ్గర నుంచి, అన్నిటి పై విమర్శలు చేసారు. కేసీఆర్ చంద్రబాబుకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏమో కాని, ఆంధ్రా సెంటిమెంట్ తో చంద్రబాబు ఇస్తున్న సర్ప్రైజ్ గిఫ్ట్ తో కేసీఆర్ కు ఏమి చెయ్యాలో అర్ధం కావటం లేదు. చంద్రబాబు నుంచి ఈ ఎదురు దాడి కేసీఆర్ ఆస్సలు ఊహించలేదు. ఇప్పుడు కనుక, కేసీఆర్ చంద్రబాబుని విమర్శిస్తే అది జగన్ కు పెద్ద మైనస్ అవుతుంది, అందుకే కేసీఆర్ ఏమి అనలేక, కక్క లేక, మింగ లేక ఇబ్బంది పడుతున్నారు.