వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఈరోజు ఢిల్లీలో సమావేశం కావాలని విపక్ష నేతలు నిర్ణయించారు. దేశ రాజధానిలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో ఈరోజు ఉదయం 11.30 గంటల తర్వాత భేటీ కావాలని నిర్ణయించారు. సమావేశానికి ఏపీ, ఢిల్లీ సీఎంలు చంద్రబాబు, అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకులు అభిషేక్ మనుసింగ్వి, కపిల్‌సిబల్ తో పాటు, 21 పార్టీల ప్రతినిధులు హాజరు కానున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తీరు, ఈవీఎంలపై వస్తున్న అనుమానాలు, వీవీ ప్యాట్ స్లిప్పు లెక్కింపు, సుప్రీం కోర్టులో రివ్యూపిటిషన్ దాఖలు, ఈసీ పనితీరు తదితర అంశాలపై చర్చించనున్నారని సమాచారం. వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు, ఎన్నికలు మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించనున్నారు. ఏపీలో ఈవీఎంలు మొరాయించిన అంశంపై ఇప్పటికే చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం సూచనల ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఇది దేశానికి మంచిది కాదని అన్నారు. ఈసీపై ప్రజలు విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ‘‘కళకింత పార్టీలు, నేతలకు ఈసీ మద్దతిస్తోంది. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, రిజర్వు బ్యాంకు వంటి రాజ్యాంగ సంస్థలకు నాశనం చేశారు. ఇప్పుడు స్వయం ప్రతిపత్తిగల కేంద్ర ఎన్నికల సంఘంలో కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది’’ అని చంద్రబాబు ఆగ్రహించారు. వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపునకు 6 రోజుల సమయం పడుతుందంటూ సుప్రీం కోర్టును ఈసీ తప్పదోవ పట్టించిందని చంద్రబాబు తెలిపారు.
‘‘ఈవీఎంల పట్ల తమకు విశ్వాసం లేదని, కనీసం 50 శాతం వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాలని దేశంలో 75 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 22 రాజకీయ పార్టీలు ఈసీని కోరాయి. ఇందుకు ఆరు రోజులు పడుతుందని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించింది. నేను వారికి సవాలు చేస్తున్నా... అంత సమయం ఎందుకు పడుతుందో చెప్పాలి? గతంలో బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు మొత్తం లెక్కించడానికి 12 గంటల నుంచి అత్యధికంగా 24 గంటలు పట్టేది. ఇప్పుడు సగం వీవీప్యాట్లు లెక్కించేందుకు 6 రోజుల సమయం పడుతుందనడం సరికాదు. దాదాపు 45 నిమిషాలు చాలు’’ అని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 5 వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాల్సి ఉంటుందని, ఒకవేళ ఆ ఐదింట్లో లెక్క తప్పితే మొత్తం అన్ని వీవీప్యాట్ల స్లిప్‌లకు లెక్కించాలని డిమాండ్ చేశారు.