రాష్ట్రంలో ఆర్ధిక సుస్థిరత నెలకొని, ఆదాయ వనరులు మరింతగా పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మించేలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధికి పూర్తి స్థాయిలో సహాయసహకారాలు అందించాలని, ప్రభుత్వానికి తోడ్పాటును ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు నేతృత్వంలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు కలుసుకున్నారు.

10వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని ఈ సందర్భంగా ఏపీఎన్జీవో నేతలు ముఖ్యమంత్రిని కోరారు. 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకు మొత్తం 10 నెలల కాలానికి సుమారు రూ. 5 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి వుందని వివరించారు. అలాగే 2018 జులై 1 నుంచి అమలు చేయాల్సిన 11వ పీఆర్సీ కోసం ముందుగానే కమిషన్ వేయాలని, కమిషనర్‌ను నియమించాలని విన్నవించారు. పీఆర్సీ నివేదిక ఇచ్చేందుకు ఏడాది సమయం పట్టే అవకాశం వున్నందున గడువు సమీపించకముందే కమిషన్ వేయాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ బకాయిలు ఇవ్వడంతో పాటు ఈ ఏడాది జనవరి, జులైకు సంబంధించి రెండు డీఏలను ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు. అర్హులైన వీఆర్వోలకు పదోన్నతులు ఇవ్వడంతో పాటు, నాలుగో తరగతి ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని, ముఖ్యమైన శాఖలో పెద్దఎత్తున వున్న ఖాళీలను భర్తీ చేయాలని విన్నవించారు.

పీఆర్సీ బకాయిలు చెల్లించేందుకు, కొత్త పీఆర్సీ ఏర్పాటుకు, రెండు డీఏలు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల వినతులపై ఆర్ధికశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మిగిలిన వినతులను పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్ట్రం తీవ్ర ఆర్ధికలోటులో వుందని, ప్రజాసంక్షేమం - సమాజంలో అందరి సంతోషం కోసం అప్పులు సైతం చేయాల్సి వస్తోందని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నేతలతో అన్నారు. కేంద్రం నుంచి కూడా ఆశించనంత స్థాయిలో, సకాలంలో సాయం అందడం లేదని, అయినా ఎక్కడా రాజీపడకుండా పాలన సాగిస్తున్నామని వివరించారు. సంతోష సూచీ, పోటీతత్వంలో దేశానికి రాష్ట్రం ఆదర్శంగా నిలిచేలా చేశామన్నారు.

పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం వంటి లక్ష్యాలు మన ముందు వున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. వీటికి వేల కోట్ల రూపాయలు అవసరం వుందని, ఇలాంటి పరిస్థితుల్లో అందరం కష్టపడాలని అన్నారు. భావితరాల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని నిబద్ధత, క్రమశిక్షణ, వేగంతో పనిచేసి రాష్ట్రం పదేళ్లపాటు కనీసం 15% వృద్ధి నమోదు చేసేలా చూడాలని అన్నారు. అంతా ఆన్‌లైన్ చేయడం, ఇ-ఆఫీస్ ద్వారా ఉద్యోగుల శ్రమ భారాన్ని తగ్గించామని తెలిపారు. ‘నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం తర్వాత రాష్ట్రం కోసం ఉద్యోగులు ఎంతో శ్రమించారు. ఇకముందు రాష్ట్రం అన్నిరంగాల్లో దేశంలోనే ముందు నిలిచేలా మీ సహకారం వుంటుందని ఆశిస్తున్నాం. మీ సంక్షేమం కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది.’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

నవంబర్ 4న తిరుపతిలో జరిగే ఏపీఎన్జీవో కౌన్సిల్ సమావేశాలకు ముఖ్య అతిధిగా రావాలని ఆ సంఘం నేతలు ఆహ్వానించగా, ముఖ్యమంత్రి అందుకు అంగీకరించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఏపీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణా జిల్లా (పశ్చిమం) అధ్యక్షుడు విద్యాసాగర్, ఇంకా యూటీఎఫ్, ఎస్‌టీయూ, పీఆర్‌టీయూ, ఏపీటీఎఫ్ తదితర ఉద్యోగ సంఘాల నేతలు వున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read