ఎన్నికల సంఘం, ఈవీఎంల్లో లోపాలను ఎత్తిచూపడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న హరిప్రసాద్‌ను చర్చలకు అనుమతించకపోవటాన్ని ఖండిస్తున్నట్లు తెలుగుదేశం లీగల్ సెల్ అధ్యక్షుడు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం రాత్రి ఈసీకి మూడుపేజీల లేఖ రాశారు. తొమ్మిదేళ్ల క్రితం హరిప్రసాద్‌పై ఈవీఎం చోరీ ఆరోపణలపై నమోదు చేసిన కేసులో ఇప్పటివరకూ కనీసం ఛార్జిషీట్ కూడా దాఖలు చేయలేదన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. గతంలో ఈవీఎంలపై జరిపిన సమావేశాలకు ఆయనను అప్పటి ప్రధాన కమిషనర్లు ఎస్‌వై ఖురేషీ, వీఎస్ సంపత్‌లు ఆహ్వానించారని చెప్పారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు సమస్య పరిష్కారంపై దృష్టిపెడితే బాగుంటుందని కోరారు.
‘అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్స్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ ఈపీఎఫ్ పయనీర్ అవార్డ్-2010 అవార్డుతో సత్కరించిన తొలి భారతీయుడు హరిప్రసాద్. ఆ అవార్డు స్థాపించిన 27 ఏళ్లలో ఏ భారతీయునికీ ఆ గౌరవం దక్కలేదు. భద్రతా పరిశోధకుడిగా ఆయన ఈవీఎంలలో ఉన్న లోపాలను వెల్లడించారు. 2011 జులై 21న కేంద్ర ఎన్నికల సంఘం దిల్లీలో తొలిసారి ఏర్పాటు చేసిన వీవీప్యాట్ క్షేత్ర స్థాయి ప్రయోగానికి రమ్మని ఆయనకు ఆహ్వానం పంపింది. నాటి సీఈసీ వీఎస్ సంపత్, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ అలోక్ శుక్లాలను హరిప్రసాద్ కలిశారు. ఎన్నోసార్లు ఈసీ ఆహ్వానం మేరకు సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రజావేగుగా ఈవీఎంలలో ఉన్న లోపాలను వెలికి తీయడానికి ప్రయత్నించిన ఆయనపై తప్పుడు కేసు నమోదైన తర్వాతే ఈ సమావేశాలన్నీ సాగాయి. ఈ అంశాన్ని మీ రికార్డులను తనిఖీ చేసుకుని ధ్రువీకరించుకోవచ్చు.
శనివారం నాటి ఈసీఐతో ముఖ్యమంత్రి భేటీకి సాంకేతిక సలహాదారు హోదాలో హరిప్రసాద్ హాజరయ్యారు. ఈవీఎంలలో తలెత్తిన లోపాల గురించి ఆయన పూర్తి స్థాయిలో వివరించారు. ఆ తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనరు ఆహ్వానం మేరకు 4 గంటలకు ఈసీఐ సాంకేతిక నిపుణుల కమిటీ ఛైర్మన్ డీటీ సహానిని కలిశారు. సమావేశంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఈసీ అధికారి సుదీప్ జైన్ రామ్మోహన్ నాయుడిని లోపలికి పిలిచి, క్రిమినల్ కేసు దృష్ట్యా హరిప్రసాద్‌తో ఎన్నికల సంఘం చర్చలు జరపడానికి ఇష్టపడటం లేదని చెప్పారు. ఇప్పుడు సమస్యపై దృష్టి సారించడానికి బదులు దాన్నుంచి తప్పించుకోవడానికి ఎన్నికల సంఘం ఇలాంటి ఎత్తులు వేస్తోందనిపిస్తోంది. హరిప్రసాద్‌కున్న నిపుణతను దృష్టిలో ఉంచుకుని సోమవారం ఆయన్ను చర్చలకు ఆహ్వానిస్తారని మేం ఆశిస్తున్నాం’ అని రవీంద్రకుమార్ పేర్కొన్నారు.