సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన తెదేపా వ్యూహ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యనేతలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నేతలందరితోనూ సీఎం చంద్రబాబు సుమారు రెండున్నర గంటల పాటు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వ్యూహ కమిటీ భేటీలో భాగంగా సీఎం చంద్రబాబు 13 జిల్లాలకు చెందిన సుమారు 15వేల మంది నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం వైఫల్యం చెందిన నేపథ్యంలో తెదేపా తీసుకున్న నిర్ణయంతో తలెత్తిన రాజకీయ పరిణామాలను వారందరికీ వివరించారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగిన కారణాలను సైతం వారికి వివరించారు.
కేంద్రమంత్రి పదవులకు సుజనా చౌదరి, అశోక్‌గజపతిరాజు రాజీనామాలు చేసిన నేపథ్యంలో నేతల స్పందనను చంద్రబాబు కోరగా.. అధిక శాతం మంది నేతలు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అలాగే ప్రజల నుంచి కూడా సానుకూలమైన స్పందన వస్తోందని సీఎంకు వివరించినట్టు సమాచారం. అయితే, ఇంకా ఎన్డీయేలో కొనసాగడంపై వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని వారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సీఎం స్పందిస్తూ సందర్భానుసారం నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక సాయం విషయంలోనూ బీజేపీ అన్యాయం చేసిందని సీఎం దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ మన కన్ను పొడవాలనుకుని, తన రెండు కళ్లను పోగొట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి న్యాయం చేస్తుందనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని గుర్తుచేశారు.
"రెండు జాతీయ పార్టీలు ఏపీ ప్రజల మనోభావాలను అర్థంచేసుకోలేదు. అందువల్ల రెండు జాతీయ పార్టీలు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించండి. తెదేపా తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. పార్లమెంట్‌లో తెదేపా ఎంపీలు పోరాడుతుంటే.. వైకాపా ఎంపీలు కూర్చుంటున్నారు. విజయసాయిరెడ్డి వైఖరే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర విభజన సమయంలో జగన్ పార్లమెంట్‌లో సోనియాకు కనబడకుండా తిరిగారు. ఇప్పుడు మోదీ ప్రాపకం కోసం ఆయన పాకులాడుతున్నారు. ఎంపీలు రాజీనామాలు చేస్తే పార్లమెంట్‌లో ఏపీ ప్రజల గళాన్ని ఎవరు విన్పిస్తారు? ఎంపీలంతా రాజీనామాలు చేస్తే భాజపాకు లాభం చేకూర్చడమే అవుతుంది. వైకాపా వైఖరి చూస్తుంటే ఇలాగే కనబడుతోంది’’ అని సీఎం అన్నారు.