రాష్ట్రంలో వైకాపా నాయకుల అవినీతి, అమానుష చర్యలను ఎదుర్కొని ధైర్యంగా పోరాడుతున్న టిడిపి నాయకులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఆయా నాయకులతో ఫోన్ లో మాట్లాడి అభినందనలు తెలిపారు చంద్రబాబు. విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై సాయిబాబా ఆలయంలో సత్య ప్రమాణానికి రావాలని సవాల్ చేసిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణను చంద్రబాబు అభినందించారు. విశాఖలో జె గ్యాంగ్ భూకబ్జాలు, అవినీతి అక్రమ వసూళ్లపై పోరాటం చేస్తున్న టిడిపి నాయకులకు అభినందనలు తెలిపారు. ‘‘ఛలో పులివెందుల’’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎమ్మెల్సీ బిటెక్ రవి, ఎంఎస్ రాజు, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, లింగారెడ్డి, జిల్లా పార్టీ నాయకులను ప్రశంసించారు. కడప, అనంతపురం జిల్లాలలో దళిత ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న టిడిపి నాయకులను అభినందించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండి వారిలో మనోధైర్యం పెంచడాన్ని ప్రశంసించారు. పలాసలో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహాన్ని కూలగొడ్తామన్న మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లాలో ఆందోళనలు జరిపిన మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీషకు ఫోన్ చేసి అభినందించారు. బడుగు బలహీన వర్గాల పోరాట యోధుడు గౌతు లచ్చన్నపై మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనల్లో పాల్గొన్న ఏపి టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాలం అశోక్, కూన రవికుమార్, శ్రీకాకుళం జిల్లా పార్టీ నాయకులను ప్రశంసించారు.
అనపర్తిలో వైసిపి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై ధ్వజమెత్తి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని చంద్రబాబు అభినందించారు. గుడిలో ప్రమాణం చేద్దామన్న రామకృష్ణారెడ్డి సవాల్ ద్వారా అనపర్తి ఎమ్మెల్యే అవినీతిని ప్రజల్లో నిలదీశారని ప్రశంసించారు. మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి తన అనుచరులతో దౌర్జన్యానికి పురిగొల్పి తాడిపత్రిలో ఉద్రిక్తతలు సృష్టించిన వైసిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దుశ్చర్యలను ప్రజల్లో ఎండగట్టిన జెసి కుటుంబాన్ని, అనంతపురం టిడిపి నాయకులను చంద్రబాబు ప్రశంసించారు. పల్నాడులో వైసిపి దుర్మార్గాలపై ధ్వజమెత్తిన గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, జిల్లా పార్టీ నాయకులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టిడిపి నాయకులు, శ్రేణులంతా సంఘటితంగా వైసిపి దుర్మార్గాలపై రాజీలేని పోరాటం చేయాలని, వైసిపి బాధిత ప్రజానీకానికి అండగా ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.