మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతుంది. అయితే రాష్ట్రంలో ఎక్కడ సంక్రాంతి శోభ అయితే లేదు. సంక్రాంతి కానుకలు లేవు. ఇసుక లేక పనులు లేక, మొన్నటి దాక ఇబ్బందులు పడ్డారు. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో మరో సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదే అమరావతి రాజధాని తరలింపు. దీంతో అమరావతిలో రైతులు గత 22 రోజులుగా నిరసనల్లో ఉన్నారు. పనులు అన్నీ మానుకుని, ఇంట్లో ఆడవాళ్ళతో సహా రోడ్డున పడ్డారు. వారికి పండుగ లేదు, పబ్బం లేదు. జీవితాలు నాశనం అవుతున్నాయనే ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం మాత్రం, ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో వారు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు 10 మంది గుండె ఆగి చనిపోయారు. మొన్న జనవరి ఒకటిన కూడా వారి జీవితాల్లో సంతోషం లేదు. అలాగే వైకుంఠ ఏకాదశి రోజున కూడా, వారు రోడ్ల మీదే ఉన్నారు. ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తూ ఉండటంతో, ఇప్పటికే పిండి వంటలు తయారు చేస్తూ పల్లెటూరుల్లో హడావిడి ఉండేది. అవేమి కనిపించటం లేదు.
అయితే ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, నేను ఎలా పండుగలు చేసుకుంటాను అంటూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అన్నీ బహిష్కరించారు. మొన్న జనవరి ఫస్ట్ రోజున కూడా, అమరావతి ప్రజల మధ్యే గడిపారు. తన సతీమణితో కలిసి, రైతులతో కలిసి ఆందోళనలో పాల్గున్నారు. అయితే ఇప్పుడు సంక్రాంతి పండుగని కూడా జరుపుకోకూడదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏడాది, నారా, నందమూరి కుటుంబాలు, చంద్రబాబు సొంత ఊరు అయిన, చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం, నారా వారి పల్లెలో సంక్రాంతి పండుగ జరుపుకునేవారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా, ఆయన మూడు రోజులు అక్కడ గడిపేవారు. అయితే ఈ సారి మాత్రం, చంద్రబాబు పండుగకు దూరంగా ఉంటున్నారు.
అమరావతిలో ప్రజలు ఆందోళనలతో రోడ్డు మీద ఉంటే, తాను పండుగలు ఎలా జరుపుకుంటానని, అందుకే దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇలా ఉంటే, చంద్రబాబు కూడా ప్రజలకు ఒక పిలుపు ఇచ్చారు. సంక్రాంతి పండుగకు సొంత ఉళ్ళకు వచ్చే అందరూ, అమరావతి ఆవశ్యకత పై, అక్కడ ప్రజలకు తెలిసే విధంగా చెప్పాలని, అలాగే భోగి పండుగ రోజున, జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలు తగల బెట్టాలని, ఆ ప్రతులు, భోగి మంటల్లో వెయ్యాలని పిలుపిచ్చారు. అలాగే అందరూ అమరావతి వచ్చి, అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీ భావం తెలపాలని కోరారు. అమరావతిని రక్షించుకోవాలని, మనకంటూ ఒక మంచి రాజధాని కట్టాలని ప్లాన్ చేస్తే, వీళ్ళు అమరావతిని ఇలా చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.