ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు తిరుపతిలో పర్యటిస్తున్నారు. అమరావతి పాదయాత్ర ముగింపు సభలో పాల్గునటానికి చంద్రబాబు తిరుపతి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు, అక్కడ నుంచి నేరుగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం చంద్రబాబు, కిందకు వచ్చి, అమరావతి సభలో పాల్గుననున్నారు. అయితే చంద్రబాబు వైకుంఠం క్యూకాంప్లెక్స్ దగ్గర టిటిడి సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు.సాధారణంగా చంద్రబాబు ఎప్పుడు తిరుమలకు వచ్చినా కూడా, స్వామి వారి పై ఉన్న భక్తీ విశ్వాసాలతో, ఆలయ నిబంధనలు పాటిస్తూ వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచే, స్వామి వారి ఆలయంలోకి వెళ్తారు. ఈ సారి కూడా చంద్రబాబు వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి వెళ్తున్న సమయంలో, ఎప్పుడూ లేనట్టుగా, ఎస్పీఎఫ్ సిబ్బంది చంద్రబాబు భద్రతా సిబ్బందిని కూడా తనిఖీ చేయటం వివాదాస్పదం అయ్యింది. చంద్రబాబుతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికీ తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేయటంతోనే, ఇలా చేసినట్టు తెలుస్తుంది. ప్రముఖులు వచ్చిన సందర్భంలో, వారి భద్రతా సిబ్బందిని తనిఖీ చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని, చంద్రబాబుతో పాటు ఉన్న అందరినీ కూడా తనిఖీ చేసారని టిడిపి శ్రేణులు అంటున్నాయి.
ఇది కొత్త నిబంధన అయితే, అందరికీ, అందరి విఐపిలకు కూడా ఇలాగే చేస్తే అభ్యంతరం లేదు కానీ, కేవలం చంద్రబాబు టార్గెట్ గా ఇలా చేస్తున్నారని వాపోయారు. అందుకు భిన్నంగా ఇక్కడ వ్యవహరించారని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే అక్కడ జరుగుతున్న తతంగం మొత్తం గమనిస్తున్న చంద్రబాబు, అన్నీ గమనిస్తూనే, ఏమి అనుకుండా, మౌనంగా ముందుకు వెళ్ళిపోయారు. చంద్రబాబు శ్రీవారి దర్శనం అనంతరం, మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకు అమరావతి రాజధాని అని, ఇదే అందరి కోరిక అని చంద్రబాబు అన్నారు. పాదయాత్ర చేసిన వారికి మద్దతు ఇచ్చేందుకే ఇక్కడ వరకు వచ్చానని అన్నారు. అమరావతి మహా సభలో హాజరు అవుతానని, అక్కడ ప్రసంగిస్తానని చంద్రబాబు అన్నారు. మరో పక్క ఇప్పటికే సభ ప్రారంభం అయ్యింది. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు, ఈ సభకు వచ్చి మద్దతు పలికారు. కేవలం వైసీపీ మాత్రమే ఈ సభకు రాలేదు.