కేంద్రం తీరుకు నిరసనగా ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి చేపట్టిన రాష్ట్ర బంద్‌కు సంఘీభావంగా ఏపీ సీఎం చంద్రబాబు నల్ల చొక్కా ధరించి అసెంబ్లీకి వచ్చారు. ఏపీ హక్కుల సాధనకు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ సీఎం కార్యాచరణ ప్రకటించారు. విభజన చట్టం అమలులో కేంద్రం మొండిచేయి చూపిస్తున్నందున, కేంద్రం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున ఈరోజు నిరసన దినంగా పాటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మరో పక్క, ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందంటూ శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. నల్ల దుస్తులతో టీడీపీ ఎంపీలు తమ నిరసనను వ్యక్తం చేశారు. విభజన హామీలు నెరవేర్చాలని ఎంపీలు డిమాండ్ చేశారు.
ఇలా కేంద్రం పై రాష్ట్రమంతా నిరసన తెలుపుతూ ఉండగానే, చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీయేతర ఐక్యఫ్రంట్ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహూల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలతో చర్చించాలని నిర్ణయించారు. ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా, విభజన అంశాల అమలు, నిధుల కేటాయింపులో కేంద్రం ప్రదర్శిస్తున్న నిరంకుశ వైఖరితో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులను నిరసిస్తూ ఐక్యఫ్రంట్‌తో కలసి కార్యాచరణ రూపొందించాలని భావిస్తున్నారు. గత నెలలో కోల్‌కతాలో జరిగిన భారీ ర్యాలీ అనంతరం జరుగుతున్న పరిణాలు భేటీలో ప్రస్తావనకు రానున్నాయి.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌చేస్తూ హోదా సాధన సమితి శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్లమెంట్‌లో టీడీపీ చేస్తున్న ఆందోళనను తీవ్రతరం చేయటం ద్వారా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది చంద్రబాబు వ్యూహం. ఇప్పటివరకు నాలుగు బడ్జెట్‌ల్లో రాష్ట్రానికి అరకొర కేటాయింపులు జరిగాయని శుక్రవారం జరిగే బడ్జెట్ కూడా ఇదే తరహాలో ఉంటుందని, ఇందుకు నిరసనగా పార్లమెంట్‌లో వాదనలు వినిపించేలా ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు వరకు రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు పిలుపునిచ్చారు.