ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్, జనతాదళ్ మిత్రపక్షాల అభ్యర్థి, మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు నిఖిల్ కుమారస్వామి తరఫున మండ్యలో ఆయన ప్రచారం చేస్తారు. మండ్య జిల్లా పాండవపురలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సినీ నటి, దివంగత కన్నడ నటుడు అంబరీశ్ సతీమణి సుమలత పోటీ చేస్తున్నారు. సుమలతకు భాజపా బేషరతుగా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి వస్తున్నారన్న సమాచారంతో తెలుగు ఓటర్లలో ఉత్సాహం మొదలైంది. బెంగళూరు, బళ్లారి, రాయచూరు, కోలార్, చిక్కబళ్లాపుర ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తారు.
10 నెలల క్రితం కర్ణాటక విధానసభకు నిర్వహించిన ఎన్నికల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు ఇచ్చిన పిలుపు పెద్ద ఎత్తున ప్రభావం చూపింది. కేంద్రం విభజన చట్టంలో ఆంధ్రకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని, దీంతో ఎన్డీఏకు మద్దతు ఉపసంహరించామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ప్రభావం కర్ణాటకలో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండే 50కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాలపై నేరుగా పడిందని జాతీయ స్థాయిలో రాజకీయ విశ్లేషణలు వెల్లడించాయి. ముఖ్యంగా హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలోని 40 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ 21, భాజపా 15, బెంగళూరులోని 28 సీట్లలో కాంగ్రెస్ 15, భాజపా 11, బళ్లారిలోని మొత్తం 9సీట్లలో కాంగ్రెస్ 6 సీట్లను గెలుచుకున్నాయి. ప్రస్తుతం మండ్యలో పార్టీల కన్నా అభ్యర్థుల వ్యక్తిగత అంశాలకు ప్రచారంలో ప్రాధాన్యం లభిస్తోంది. సుమలత- ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అంటూ మండ్య సిట్టింగ్ ఎంపీ, జేడీఎస్ నేత శివరామే గౌడ ఇటీవల చేసిన వ్యాఖ్య దుమారం రేపింది.
జేడీఎస్ నేతలు ఈ వ్యాఖ్యలకు భయపడే చంద్రబాబును ప్రచారానికి దించినట్లు భాజపా విమర్శలు గుప్పిస్తోంది. చంద్రబాబు ఓ సామాజికవర్గానికి చెందిన నేత మాత్రమే కాదని మాజీ ప్రధాని దేవేగౌడ భాజపా విమర్శలకు గట్టిగానే బదులిచ్చారు. ఆయన ప్రచారం కేవలం మండ్య అభ్యర్థి కోసమే కాదని, భాజపాను ఓడించే క్రమంలో ‘మహాఘట్ బంధన్’ను బలోపేతం చేసేందుకేనని జేడీఎస్ వర్గాలు చెప్పాయి. గత విధానసభ ఎన్నికలు, ఆపై 5 స్థానాల ఉప ఎన్నికల్లో మిత్రపక్షాల విజయం జాతీయ రాజకీయాలకు ఊతమని భావించే చంద్రబాబు మండ్యలో ప్రచారానికి వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గత ఏడాది, కేవలం తెలుగు ఓటర్ల వల్లే అధికారానికి అతి దగ్గరగా వచ్చి ఓడిపోయామని, దానికి చంద్రబాబు ప్రచారామే కారణం అని బీజేపీ ఇప్పటికే చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభావం, ఎంపీ సీట్ల పై ఏ మాత్రం ఉంటుందో అని బీజేపీ అంచనా వేస్తుంది.