తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 28న గుంటూరు రానున్నారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో జరిగే ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటారు. కార్యాలయం ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పించిన తర్వాత పార్టీ నేతలతో సమావేశమవుతారు. సాధారణంగా ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి ఎన్నికల ఫలితాలకు ముందే మహానాడు నిర్వహణపై తెదేపా చర్చించింది. ఎన్నికల ఫలితాల విడుదల హడావుడి ఉంటుంది కాబట్టి జులైలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే మహానాడుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ జయంతిని మాత్రం ఈ నెల 28న యథావిధిగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించగలదో లేదో అని సంశయంతో ఉన్నవారిని సైతం తీవ్ర విస్మయానికి గురిచేసే రీతిలో ఆ పార్టీ పరాజయం పాలైంది. అయితే ఇంత ఘోరమైన ఓటమిని చవిచూస్తుందని మాత్రం ఎవరూ అనుకోలేదు. తెలుగుదేశాన్ని తీవ్రంగా నిరాశపరచిన అంశం ఏమిటంటే- ప్రజలకు భారీయెత్తున నగదు పంపిణీ చేసే పథకాలను అమలుచేసినా ఓటమి తప్పకపోవడం! ‘పసుపు కుంకుమ’ పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు 2016లో ఒకసారి, పోలింగుకు కొద్దిరోజుల మందు మరోసారి పదేసి వేల రూపాయల వంతున ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ చేసింది. ఇలా ప్రయోజనం పొందిన మహిళలు సుమారు 90 లక్షల పైచిలుకు ఉన్నారు.
వీరి ఓట్లపైనే తెలుగుదేశం బాగా ఆశలు పెట్టుకుంది. రైతులకోసం ‘అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని చేపట్టి 46 లక్షలమంది రైతులకు తొలివిడతగా ఒక్కొక్కరికి నాలుగువేల వంతున పోలింగుకు కొద్దిరోజుల ముందు పంపిణీ చేసింది. వీటికి తోడు పట్టిసీమ నిర్మాణం, పోలవరం పురోగతి, రాజధాని వంటి అంశాల్లో తాము చేసిన కృషి ఎన్నికల్లో విజయానికి పునాది వేస్తుందని తెలుగుదేశం గట్టిగా నమ్మింది. పోలవరం, రాజధాని పనులపై ప్రజలకు సానుకూల అభిప్రాయం ఏర్పడటం కోసం కొద్ది నెలలుగా నిత్యం బస్సుల ద్వారా వివిధ ప్రాంతాల ప్రజలతో సందర్శన యాత్రలు నిర్వహించింది. ప్రభుత్వ ఖర్చుతో ఇలా లక్షల మంది ఆ పనులను చూశారు. రాష్ట్రంలో కియా కార్ల కర్మాగారం ఏర్పాటయ్యేలా చూడటం, హెచ్సీఎల్ వంటి ఐటీ కంపెనీలను రాష్ట్రానికి వచ్చేలా చేయడంలో ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా చేసిన కృషి చాలా ఉంది. ఇంత కృషి సల్పిన తమకే ఓట్లు వేస్తారనే విశ్వాసంతో తెలుగుదేశం వ్యవహరించింది. కాని చివరకు అనేక కారణాల వల్ల, ప్రజలు తెలుగుదేశాన్ని తిరస్కరించారు.