ఢిల్లీ వేదికగా చంద్రబాబే స్వయంగా పోరు మొదలుపెట్టనున్నారు. కేంద్రంపై పోరును ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు. విభజన హామీలను నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు పావులు కదుపుతున్న బాబు... రాత్రికి ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అన్ని పార్టీల నేతలకు వివరించి... అవిశ్వాసానికి అండగా నిలవాలని కోరనున్నారు. మంగళ, బుధవారాలు ఆయన అక్కడే ఉంటారు... రాష్ట్ర సమస్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో పాటూ... ఎంపీలకు పంచేందుకు పుస్తకాలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు ఈ సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి, సమాజ్‌వా దీ పార్టీ ముఖ్యనేత ములాయంసింగ్ యాద వ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధా ని దేవగౌడ, ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ, బీజేడీ లోక్‌సభాపక్ష నేత భర్తృహరి మెహతాబ్‌లతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన శిరోమణి అకాలీదళ్ సీనియర్ నాయకుడు, పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్, ఎల్‌జేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్, శివసేన ముఖ్యులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర విభజన బిల్లుకు బీజేపీ మద్దతుతోనే ఆమోదం లభించడం, కాంగ్రెస్ ఆనాడు ప్రత్యేక హోదా అంశాన్ని బిల్లులో చేర్చకపోవడం, ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ తిరుపతి సభలో ఇచ్చిన వాగ్దానం ఎలా తుంగలో తొక్కారు.. ఢిల్లీకి మించిన రాజధాని నిర్మాణ హామీ బుట్టదాఖలు, విభజన చట్టంలో పేర్కొని రాష్ట్రానికి రావల్సిన ప్రయోజనాలు అమలు కాకపోవడం, వాటిపై కేంద్రం తీరు వంటి అంశాలను నేతలందరికీ స్పష్టంగా వివరించాలనేది సీఎం ప్రధానోద్దేశం.