నవనిర్మాణ దీక్షలను సవాల్‌గా తీసుకోవాలని... అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ‘మీ అందరి సహకారంతో నాలుగేళ్లలో అద్భుత విజయాలు సాధించాం.. ఇందులో భాగంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు.. అది రాష్ట్రం బాగు కోసమే తప్ప మరోటి కాదు...’ అని జిల్లాల కలెక్టర్లు, వివిధశాఖల అధికారులకు స్పష్టం చేశారు. వారితో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులతో శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నేటి నుంచి ప్రారంభం కానున్న నవనిర్మాణ దీక్షలు, నిర్వహించాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. విభజన కారణంగా రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కుపోయిందని, అందుకే వేడుకలు చేసుకునే విభజన కాదు మనదని పేర్కొన్నారు. ఈ ఏడు రోజుల దీక్షలను విజయవంతం చేయాలని సూచించారు.
"నాలుగేళ్ల అభివృద్ధికి సూచికగా ప్రతి జిల్లాలో పైలాన్లు ఆవిష్కరించాలి. గ్రామం, వార్డుల వారీగా ఎంత అభివృద్ధి జరిగింది? సంక్షేమ కార్యక్రమాలు ఎంత మందికి అందాయో తెలియజేస్తూ నోటీసు బోర్డులు పెట్టాలి. దీక్ష పూర్తికాగానే నోడల్ బృందం ప్రతి గ్రామంలో పర్యటించాలి. అక్కడి సమస్యలు అధ్యయనం చేయాలి. అభివృద్ధిని సమీక్షించాలి. ప్రజల ఆకాంక్షలు తెలుసుకోవాలి. గ్రామం, వార్డుల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలి. ప్రతి ఇంటి నుంచి ఒక కంప్యూటర్ నిపుణుడు, ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి. ఆక్వాలో సమస్యలు అధిగమించాం. శనగలు, కందులు, మిర్చి కొనుగోలు చేశాం. రైతులను ఆదుకున్నాం. రూ.50వేల కోట్లతో 19లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. త్వరలో 4లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహిస్తాం. ఉపాధిహామీ కింద ఈ నెలలో రూ.1,415కోట్ల నిధులు సద్వినియోగం చేసుకున్నాం. కేంద్ర తోడ్పాటు లేకున్నా ఎంతో చేశాం. 100శాతం విద్యుత్తు, గ్యాస్ ఇచ్చాం. అక్టోబరు 2 నాటికి అన్ని పంచాయతీల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నాం" అని అన్నారు.
ఈ-ప్రగతి అమలులో తనను మెప్పించాలని చూస్తే ప్రయోజనం ఉండదని, దీని అమలు వల్ల ఎంత ప్రభావం కనిపించిందో చెప్పగలగాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఈ-ప్రగతి అమలు పురోగతిని సమీక్షించారు. రియల్ టైం గవర్నెన్స్(ఆర్‌టీజీ), ఈ-ప్రగతి ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని, ప్రజా సంతృప్తికి అందరూ పని చేయాలని సూచించారు. ఈ-ప్రగతి ఇంటిగ్రేషన్ ప్రక్రియ వేగవంతం చేసి, అన్ని శాఖల్లో అమలు చేసేలా చూడాలని ఆదేశించారు. విద్యాశాఖలో ఆన్‌లైన్ ప్రవేశాలు, దరఖాస్తులకు సంబంధించిన మాడ్యుల్స్ పూర్తి చేశామని, సెప్టెంబరు 30నాటికి అమలులోకి తీసుకురానున్నామని అధికారులు వివరించారు.