ఉత్తరాంధ్ర బాధ్రాద్రిగా పేరున్న విజయనగరం జిల్లా రామతీర్ధంలో కోదండరాముని విగ్రహం ధ్వంసం చేసి, తలని పెకలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన ఎవరు చేసారో ఇప్పటి వరకు తెలియలేదు. మూడు రోజుల నుంచి భక్తులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇలాంటి చర్యలు పాల్పడిన వారి పట్ల పూర్తీ స్థాయిలో దర్యాప్తు చేసి శిక్షలు వేయాలని, పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. అయితే ఇక్కడ మరో ఘోరమైన చర్య ఏమిటి అంటే, తల భాగం కంగిపించకుండా పోయింది. దీంతో వెంటనే గుర్తించి, విగ్రహం వద్దకు చేర్చాలి అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసారు. అయితే దీని పై ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ టీం లు వేసారు. ఈ స్పెషల్ టీం మొత్తం పరిసరాలు గాలించింది. అయితే ఆలయం ఆనుకుని ఒక కొలను ఉండగా, ఆ కోలనలో గాలింపు చేసారు. మోటార్ ఇంజిన్ లు పెట్టి, నీళ్ళు అన్నీ తొడేసారు. చివరకు అక్కడే ఆ తల భాగం దొరికింది. దీంతో పూజారి, అధికారులు ఆ తల భాగాన్ని తీసుకుని వచ్చి, విగ్రహం వద్దకు చేర్చారు. చినజీయర్ స్వామీ ఆధ్వర్యంలో ఒక మంచి శుభదినాన, మళ్ళీ విగ్రహం ప్రతిష్ట చేస్తామని అన్నారు. అయితే ఇది ఇలా ఉంటే ఈ ఘటన పై మాత్రం ఇప్పటి వరకు ఎవరినీ పట్టుకోలేదు. ఎవరు చేసారో ఇప్పటి వరకు ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈ ఘటన పై తెలుగుదేశం పార్టీ సీరియస్ అయ్యింది. ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎలాంటి పర్యటనలు చేయలేదు. బయట పర్యటనలకు నారా లోకేష్ వెళ్తున్నారు. అయితే ఈ ఘటన పై మాత్రం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయనే నేరుగా రంగంలోకి దిగుతున్నారు. రేపు విశాఖ వెళ్తున్నారు. అమరావతి నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్ కు వెళ్లి, అక్కడ నుంచి ఉదయం10:00 గంటలకు విజయనగరం నెల్లిమర్ల రామమందిరం వద్దకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో రోజు రోజుకీ దేవాలయాల పై సంఘటనలు ఎక్కువ అయిపోతున్నాయని, దాదాపుగా 100కు పైగా ఘటనలు జరిగినా ప్రభుత్వం మాత్రం, ఒక్కరిని కూడా పట్టుకులేదని తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఈ రోజు కూడా రెండు సంఘటనలు జరిగాయి. అయితే ఈ ఘటనలలో ఇప్పటి వరకు ఖండిస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ నేరుగా రంగంలోకి దిగుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా, ఈ అంశం పై పోరాటం చేయక పొతే, ప్రభుత్వం పట్టించుకునే లేదని, అందుకే చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగి, ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తారని, తెలుగుదేశం శ్రేణులు చెప్తున్నారు.