సుమారు 45రోజుల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయానికి వచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణంపై ఆయన సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులు పాల్గొన్నారు. అమరావతి నిర్మాణ పనులు పురోగతిపై చర్చలు జరిపారు. పరిపాలన నగరంలో చేపట్టిన శాసనసభ్యుల నివాస భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కొత్త శాసనసభ కొలువుదీరిన వెంటనే నూతన సభ్యులు రాజధానిలో ఉండేందుకు వీలుగా వారికి నివాస భవనాలను సిద్దంచేయాలని చెప్పారు. గురువారం మధ్యాహ్నం సచివాలయంలో సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో రాజధాని పనుల పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. రాజధానిలో చేపట్టిన నిర్మాణాలను ప్రాధాన్య క్రమంలో గుర్తించి వాటిని వర్షాకాలం నాటికి పూర్తిస్థాయిలో సిద్దం చేయాలని సూచించారు. రాజధాని నగరం నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీని అందించే రహదారులలో తొలుత న్యాయ వివాదాలు లేని రహదారులను గుర్తించి వాటిని శరవేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.
ఈ రహదారులు సిద్ధమైతే రాజధానికి ఒక సమగ్రమైన ఆకృతి వస్తుందని, ముఖ్యంగా అమరావతికి రాకపోకలు పెరుగుతాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. పచ్చదనం, విద్యుత్ దీపాలతో సహా ముఖ్య రహదారులను యుద్ధ ప్రాతిపదికపై సిద్దం చేయాలని నిర్దేశించారు. ఎంత వీలయితే అంత త్వరగా రాజధానికి ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చాలని చెప్పారు. రాజధానిలో రూ.51,687 కోట్లతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయని, అందులో మొత్తం 19,769 కోట్ల ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులకు గాను, రూ.15,414 కోట్ల పనులు (78 శాతం) కొనసాగుతున్నాయని సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. రూ.17,910 కోట్ల విలువైన ఎల్‌పీఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులకు గాను రూ.15,721 కోట్ల పనులు (88శాతం) పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ భవన సముదాయాలకు సంబంధించి మొత్తం రూ.14,008 కోట్ల విలువైన పనులలో రూ.8,786 కోట్ల పనులు (66 శాతం) జరుగుతున్నాయని తెలిపారు. ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులలో రహదారులు, వంతెనలు, యుటిలిటీస్ వంటి పనులు చేపట్టామన్నారు.
ఈ పనులన్నీ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయని చెప్పారు. ఎల్‌పీఎస్ పనులు 2022 ఏప్రిల్ నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ప్రభుత్వ భవన సముదాయాల పనులను 6 జోన్లుగా విభజించి లక్ష్యాలు నిర్దేశించుకున్నామని తెలిపారు. వీటిలో మొదటి మూడు జోన్లలో పనులు దాదాపు చివరి దశకు చేరాయని చెప్పారు. మరో 5 జోన్లు ప్లానింగ్ దశలో ఉన్నాయని అన్నారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల నివాస భవనాలు ఈ ఏడాది ఆగస్టు 12 నాటికి పూర్తవుతాయని తెలిపారు. మంత్రులు, న్యాయమూర్తులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు విల్లాలు ఆగస్టు 16 కల్లా సిద్ధం అవుతాయని చెప్పారు. సచివాలయం, విభాగాధిపతుల టవర్లు వచ్చే ఏడాది జులై 18 నాటికి పూర్తవుతాయని వివరించారు. హైకోర్టు ఐకానిక్ భవన నిర్మాణం తొలిదశ నిర్మాణం వచ్చే ఏడాది సెప్టెంబరు 28 నాటికి పూర్తవుతుందన్నారు. మరో ఐకానిక్ నిర్మాణంగా చేపట్టిన శాసనసభ భవంతి టెండర్ దశకు చేరుకుందని తెలిపారు.