జగన్ మోహన్ రెడ్డి పై, దాదాపుగా 11 సిబిఐ కేసులు, అలాగే 5 ఈడీ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు, అధికారాన్ని అడ్డు పెట్టుకుని, సూట్ కేసు కంపనీలు పెట్టి, నిధులు మళ్ళించి, తన కంపెనీల్లోనే పెట్టుబడి పెట్టించుకుని, ఇలా రకరకాలుగా క్విడ్ ప్రోకోకి పాల్పడ్డారు అంటూ, ఆయన పై సిబిఐతో పాటుగా, ఈడీ కూడా అభియోగాలు మోపింది. అయితే ఈ కేసులు ఎప్పుడో 2012లో నమోదు అయ్యాయి. ఈ కేసుల్లోనే జగన్ మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకు వెళ్లి, ప్రస్తుతం కండీషనల్ బెయిల్ పై బయట ఉన్నారు. అయితే 2012 నుంచి ఈ కేసుల విచారణ ప్రారంభం కాలేదు. ఇప్పటి వరకు డిశ్చార్జ్ పిటీషన్లు అని, ఇలా రకరకాలుగా సాగదీస్తూ తొమ్మిదేళ్ళు గడిపేశారు. ఇంకా ఒక కేసులో కూడా ట్రైల్స్ ప్రారంభం కాకపోవటంతో, అటు సిబిఐ పైన, ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీ పైన విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు సిబిఐ కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ మోహన్ రెడ్డి కేసులు తెల్చేసేందుకు సిబిఐ సిద్ధం అవుతుంది. జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఇతర వ్యాపార సంస్థల అధినేతలు, అలగే ఐఏఎస్ అధికారులు, అప్పటి మంత్రులు కూడా ఈ కేసుల్లో ఉన్నారు. అయితే మొత్తం 11 సిబిఐ కేసుల్లో, మూడు కేసులు విషయంలో అడ్డంకులు అన్నీ తొలగిపోవటంతో, ఈ కేసులు పై విచారణ ప్రారంభం కానుంది.
ఈ మేరకు జగన్ మొహన్ రెడ్డిని రెడీ అవ్వాలి అంటూ, సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా మూడు కేసుల్లో ఈ విచారణ సిబిఐ కోర్టులో ప్రారంభంకానుంది. అరబిందో, హెటిరో కేసు, లేపాక్షి కేసు, గృహనిర్మాణ ప్రాజెక్టుల కేసు, ఈ మూడు కేసుల్లో విచారణకు సిద్ధం కావాలని, జగన మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, జె.గీతారెడ్డి, ఐఏఎస్ మురళీధర్ రెడ్డి, రిటైర్డ్ అధికారి శామ్యూల్, వైవీ సుబ్బారెడ్డి, కృష్ణప్రసాద్, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డికి విచారణకు రెడీ అవ్వాలి అంటూ, సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసుల్లో ఇప్పుడు విచారణ ప్రారంభం అయితే, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏడాది లోపు ఈ కేసుల విచారణ పూర్తి కానుంది. అలాగే మిగతా ఎనిమిది కేసుల్లో కూడా త్వరలోనే విచారణ మొదలు అయితే, ఇక జగన్ మోహన్ రెడ్డి ఈ కేసుల్లో బిజీ అయిపోతారు. మరి ఈ విచారణ తరువాత, సిబిఐ కోర్టు ఏమి తేల్చుతుందో చూడాల్సి ఉంది.