ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నేడు కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకోనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రితో బాటు ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి లోకేష్ రానున్నారు. ముఖ్యమంత్రి గురువారం ఉదయం 11గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.45గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.
మధ్యాహ్నం 12గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరి ఒంటిగంటకు తిరుమలలోని శ్రీపద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు. ఒంటి గంట నుంచి సాయంత్రం 6.30గంటల వరకు రిజర్వుగా నిర్ణయించారు. 6.45గంటలకు అతిథిగృహం నుంచి బయలుదేరి రాత్రి ఏడు గంటలకు శ్రీబేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుంటారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారిని దర్శించుకుంటారు. రాత్రి 8.30 గంటలకు ఆలయం నుంచి బయలుదేరి 8.40గంటలకు అతిథిగృహం చేరుకుంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. 14వ తేదీ ఉదయం 7.30గంటలకు బయలుదేరి 8.30గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.