మోదీ పాలనలో దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఏకపక్ష నిర్ణయాలతో దేశ ప్రగతిని తిరోగమనంలోకి తీసుకెళ్లారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సీఎం చంద్రబాబును కలిశారు. దేశంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. మోదీ వ్యతిరేక శక్తులు ఏకమవడం అనివార్యం అన్నారు. బీజేపీ నియంతృత్వ పాలన నుంచి దేశాన్ని రక్షించుకోవాలంటే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని పార్టీలతో కలిపి బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు.
దేశం ఇబ్బందుల్లో పడిందని, విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అడిగితే ఇబ్బందులకు గురిచేయడం, దాడులకు పాల్పడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశాన్ని కాపాడుకోవడం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం, రాజ్యాంగబద్ధ సంస్థల స్వయంప్రతిపత్తి కాపాడి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశం బ్రహ్మాండమైనదని, ఇక్కడ ఉన్న వనరులు ఎక్కడా లేవన్నారు. యువత ఎక్కువగా ఉన్న పెద్ద మార్కెట్ కల్గిన దేశం మనదేనన్నారు. దీంతో ప్రపంచమంతా మనదేశంవైపే చూస్తోందని వ్యాఖ్యానించారు. కానీ, మోదీ ప్రవర్తనతో దేశం అనేక సమస్యలకు గురవుతుందని చెప్పారు.
దేశాన్నికాపాడుకోవడమే లక్ష్యంగా భాజపాయేతర కూటమి ఏర్పాటుకు ముందుకొచ్చామన్న ఆయన ఇప్పటికే చాలామందితో మాట్లాడామన్నారు. త్వరలో దిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు. దేశ ప్రయోజనాలే పరమావధిగా తాను కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నన్నారు. అంతేతప్ప తనకెలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు, ఆశలు లేవన్నారు. అన్ని సమస్యలను పక్కనపెట్టి విశాల ప్రాతిపదికన అన్ని పార్టీలు కలిసి రావాలని కోరుతున్నానన్నారు. ఇప్పటికే చాలామంది నేతలు తమతో కలిసి వచ్చేందుకు సిద్ధమయ్యారన్నారు. మమతా బెనర్జీతో ఈ నెల 19 లేదా 20 తేదీల్లో సమావేశమవుతానన్నారు. అనంతరం దిల్లీలో భాజపా వ్యతిరేక పార్టీలతో సమావేశమై ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో నిర్ణయిస్తామన్నారు. భాజపాను ఓడించే దిశగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై కీలకంగా చర్చిస్తామన్నారు.