ఇటీవల కాలంలో, గవర్నర్ వ్యవస్థ మీద, వస్తున్న విమర్శలు తెలిసిందే. దేశంలో అన్ని రాష్ట్రాలలో ఉన్న గవర్నర్ల చేత, బీజేపీ ఎలాంటి రాజకీయం చేస్తుందో అందరూ చూస్తూనే ఉన్నారు. మొన్నటి మొన్న కర్ణాటక ఒక ఉదాహరణ. మరో పక్క మన గవర్నర్ గురించి తెలిసిందే. గవర్నర్‌కు మధ్య జరిగిన సంవాదం. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్ వ్యవస్థ వ్యవహరిస్తూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా కేంద్రానికి నివేదికలు పంపేది గవర్నర్‌లే! నరసింహన్‌లాంటి గవర్నర్ ఇలాంటి విషయాలలో మరీ చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు. నరసింహన్ రెండు తెలుగు రాష్ర్టాలకూ గవర్నర్ అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రమే భుజానికెత్తుకుని మోయడానికి కేసీఆర్ అనుసరిస్తున్న ఎత్తుగడే కారణం అని ఏపి వర్గాలు అనుకుంటూ ఉంటాయి.
గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది కనుక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా గవర్నర్లు వ్యవహరించడం ఎప్పటి నుంచో ఉంది. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్లు వివాదాస్పదం అవుతుంటారు. ఎన్టీఆర్ హయాంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. ఆ కారణంగా ఎన్టీఆర్ ప్రభుత్వానికి నాటి గవర్నర్లు చికాకులు కలిగించేవారు. ఆ పరిస్థితిని భరించలేని ఎన్టీఆర్, గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఉద్యమమే చేశారు. చంద్రబాబు కూడా గత కొన్ని రోజులుగా గవర్నర్ పై, మండి పడుతున్నారు. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలను గవర్నరే కలుపుతున్నారనే వార్తలు వస్తున్నాయన్నారు. పంచాయతీరాజ్ జాతీయ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో సభలో చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మరో సారి, ట్విట్టర్ వేదికగా, గవర్నర్ వ్యవస్థ పై మండి పడ్డారు.
గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ అవసరాలకు వాడుకునే కొత్త సంస్కృతికి భాజాపా తెరలేపిందని చంద్రబాబు విమర్శిస్తూ ట్వీట్ చేసారు. కేంద్రంలోని అధికార పార్టీ ఈ విధంగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, ఇలా చేయడం తగదని ఆయన హితవు పలికారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధంగా ట్వీట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అలాగే, దిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వానికి చంద్రబాబు తన పూర్తి మద్దతు తెలుపుతూ మరో ట్వీట్ చేశారు. గవర్నర్ వ్యవస్థ, దిల్లీ ప్రభుత్వానికి సంబంధించి రెండు వేర్వేరు ట్వీట్‌లను సీఎం ఈ సాయంత్రం పోస్ట్ చేశారు.