బీజేపీ, ప్రధాని మోదీ పై ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన మోదీ ఏ ముఖం పెట్టుకుని ఏపీకి వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బతికామా..చచ్చామా అని చూసేందుకు ప్రధాని వస్తున్నారా అని ట్వీట్ చేసారు. "ప్రధాని @narendramodi ఇక్కడకు వస్తామంటున్నారు. ఎందుకు వస్తున్నారు? మేము బతికామా చచ్చామా చూడ్డానికి వస్తున్నారా? మా పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన మీరు ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తామంటున్నారు?" అంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు. మరో పక్క ఈ రోజు ఉదయం మీడియాతో కూడా చంద్రబాబు మాట్లాడారు. మోదీ ప్రభుత్వం బ్రిటీష్ వాళ్ల కంటే దారుణంగా ప్రవర్తిస్తోందని ఆయన అన్నారు. కేంద్రం తీరు పై జనవరి ఒకటిన నిరసన తెలుపుతామన్నారు.
ఏం చేయాలన్న దాని పై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. హింసకు తావులేకుండా పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. మోసాన్ని ప్రశ్నించకుంటే జీవితాంతం మోసం చేస్తారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని..బీజేపీతో పాటు ఆ పార్టీకి సహకరిస్తున్న వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రం సాయం లేకుండానే రాష్ట్రంలో అభివృద్ధి చేశామని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే పది జిల్లాల్లో ధర్మ పోరాటాలు చేశామని, మరో రెండు చోట్ల సభలు నిర్వహించనున్నామన్నారు. రాష్ట్రానికి రావాల్సినవి దక్కే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
బీజేపీ నాయకులు అధికారం ఉందని విర్రవీగుతున్నారని..రోజురోజుకూ దిగజారిపోతున్నారన్నారు. పెద్ద నోట్లు రద్దు చేయమని చెబితే అంతకంటే పెద్దనోటు తెచ్చారన్నారు. హోదా ఎవ్వరికీ ఇవ్వడం లేదనీ..అందుకే ప్యాకేజీకి ఒప్పుకున్నామన్నారు. ఇస్తామన్న ప్యాకేజీ కూడా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని ఆయన తెలిపారు. ఈఏపీ కింద నిధులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ తెచ్చిన చట్టాన్ని కూడా బీజేపీ అమలుచేయడం లేదన్నారు. అధికారంలోకి వస్తే హోదీ ఇస్తామన్న కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హాదాపై అన్ని పార్టీలు మద్దతు పలికాయని చెప్పారు.