రాష్ట్రంలో వాతావరణం మారింది. ఉదయం నుంచి చిరుజల్లులతోపాటు ఆకాశం మేఘావృతంగా ఉంది. ఎండ లేకపోగా.. కూల్ వెదర్ వచ్చేసింది. చాలా ప్రాంతాల్లో సన్నటి జల్లులు పడుతున్నాయి. రాష్ట్రంలో వాతావరణ మార్పులు, పిడుగులు పడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. పలు జాగ్రత్తలను, హెచ్చరికలను కింది స్థాయి వరకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అధికారులతో కలెక్టర్లు సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఉష్ణోగ్రతలు కూడా బాగా తగ్గాయి. నిన్నటి వరకు 40 డిగ్రీల ఎండ, ఉక్కబోతతో ఇబ్బంది పడిన ప్రజలు.. కూల్ వెదర్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కసారిగా 10 డిగ్రీల వరకు టెంపరేచర్ తగ్గిపోవటం.. చిరు జల్లులతో ఇక ఎండలు వెళ్లిపోయాయి అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సమ్మర్ అయిపోయింది. ఎండా కాలం ముగిసింది. అరేబియా, బంగాళాఖాతం నుంచి వీస్తున్న తేమ గాలులతో చల్లగా మారిపోయింది. గాలులు తమ దిశ మార్చుకోవటంతో ఈ విధమైన వాతావరణం ఏర్పడింది. ఈ మార్పు.. నైరుతి రుతుపవనాల రాకకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ప్రస్తుత వాతావరణంలోని మార్పులతో.. రెండు రోజుల్లోనే రాష్ట్రానికి రుతుపవనాలు రానున్నట్లు చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ ఏడాది సమ్మర్ సీజన్ ముగిసిపోయింది అంటున్నారు వెదర్ ఎక్స్ పర్ట్స్.
తెలుగు రాష్ట్రాలకు శుభవార్త. ఈ వర్షాకాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా.. దక్షిణ భారతదేశంలో మంచి వర్షాలు నమోదవుతాయని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ వరకు రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపించనుందని తెలిపింది. కేంద్ర వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకు 23 కిలోమీటర్ల వ్యాసార్థంలో వాతావరణంను అంచనా వేసేవాళ్లం కాగా ఇప్పడు 12 కిలోమీటర్ల వ్యాసార్థంలో వాతావరణంను తెలుసుకోవచ్చన్నారు. ఇప్పుడు ఐదు రోజుల ముందే వాతావరణ పరిస్థితులు తెలుసుకునే వీలుందన్నారు. అంతేకాకుండా ఎంత ప్రభావంతో వానలు కురుస్తాయో తెలిపే వ్యవస్థ ఉందన్నారు. ఏయే జిల్లాల్లో ఎంత వర్షపాతం పడుతుందో తెలుపుతూ.. జిల్లాస్థాయి అధికారులను వారం ముందే అప్రమత్తం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సీజన్‌లో దక్షిణ భారత్‌లో వర్షాలు బాగా కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.