తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండే సమయంలో, వెంకయ్య నాయుడు పేద దిక్కుగా రాష్ట్రాన్ని ఆదుకుంటూ, ఆయనకు చేతనైన సాయం చేసే వాళ్ళు. తరువాత పరిణామాలతో, ఆయన్ను ఉప రాష్ట్రపతిగా పంపించేసారు. అప్పటి నుంచి, రాష్ట్రానికి - కేంద్రానికి గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఒక్క పని కూడా రాష్ట్రానికి జరగకుండా, ఢిల్లీ పెద్దలు చేసారు. తరువాత ఎన్డీఏలో నుంచి చంద్రబాబు బయటకు వచ్చేయటం, బీజేపీ పై పోరాటం చెయ్యటం, ఏకంగా మోడీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఫ్రంట్ కట్టటం చేస్తున్నారు. మరో పక్క వెంకయ్య కూడా, ఆయన పార్టీ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ, ఏపి సమస్యల పై పెద్దగా స్పందించలేదు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో ఏ శంకుస్థాపన జరిగినా, వెంకయ్య చంద్రబాబు కలిసి పాల్గునే వారు. కాని, కేంద్రంతో గొడవ మొదలైన దగ్గర నుంచి, వెంకయ్య ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా, చంద్రబాబు ఆ కార్యక్రమాల్లో పాల్గునటం లేదు.
మొన్నా మధ్య విజయవాడలో ప్రారంభం అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ డిజైన్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గునకపోవటం, ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ, ముఖ్యమంత్రి పేరు శిలాఫలకం మీద లేకపోవటం పెద్ద దుమారం లేపింది. అయితే, ఇప్పుడు చంద్రబాబు బీజేపీ పై యుద్ధం ముమ్మరం చేసిన వేళ, వెంకయ్య, చంద్రబాబు ఒకే వేదిక పైకి రానున్నారు. ఏపి రాజధానికి తలమానికమైన విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి అంతర్జాతీయ సర్వీసుల ప్రారంభోత్సవానికి, ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు రానున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారు. డిసెంబరు 4న సింగపూర్‌కు ఇండిగో సర్వీసు ప్రారంభం కానుంది. అంతర్జాతీయ శ్రేణిలో నడుస్తున్న మొట్టమొదటి సర్వీసు కావటంతో ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది.
మరో పక్క చంద్రబాబు, వెంకయ్య ఏమి మాట్లాడతారో అనే ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ విమానం తీసుకురావటానికి, కేంద్రంతో ఎలా పోరాడాల్సి వచ్చిందో చంద్రబాబు చెప్తే, దానికి వెంకయ్య ఎలా రియాక్ట్ అవుతారో అనే ఆసక్తి నెలకొంది. మరో పక్క, ఇద్దరు వీవీఐపీలు పాల్గొంటున్న నేపథ్యంలో, కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం జిల్లా యంత్రాంగం నేతృత్వంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి ఎయిర్ పోర్టులో క్షేత్రస్థాయి సమీక్ష జరగనుంది. సింగపూర్‌కు సర్వీసుతో అంతర్జాతీయ శ్రేణిలో విజయవాడ విమానాశ్రయం నూతనాధ్యాయాన్ని సృష్టించబోతోంది. పొరుగు రాష్ట్రం హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్లే ప్రతి 100 మంది ప్రయాణికులలో 46 మంది మన ప్రాంతానికి చెందిన వారే ఉండటం చూస్తే అంతర్జాతీయ యానం విజయవాడ కేంద్రంగా వేళ్ళూనుకునే అవకాశం ఉంది. దేశీయంగా ఇప్పటికే విజయవాడ ఎయిర్‌పోర్టు రికార్డులను సృష్టిస్తోంది.