రాష్ట్రంలో ఎన్ని కల వాతావరణం అలముకున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ చతురతకు పదును పెడుతూ ప్రత్యర్ధి పార్టీలకు రోజుకో సవాల్ విసురుతున్నారు. సంక్రాంతి పండుగ అనంతరం అమరావతి చేరుకున్న చంద్రబాబు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒకవైపు గెలుపు గుర్రాలను అన్వేషిస్తూనే మరోపక్క అభివృద్ధి, సంక్షేమంపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఇస్తున్న పింఛన్లను రెట్టింపుచేసి అందరినీ ఆశ్చర్యపర్చిన చంద్రబాబు రోజుకో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రకటిస్తూ ఎన్నికల రేసులో ముందుకు దూసుకెళ్తున్నారు. సామాజిక భద్రత పింఛన్ల రెట్టింపు కార్యక్రమాన్ని ప్రకటించిన 24 గంటల్లో గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల తగ్గించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
మరో 24 గంటల సమయం తీసుకుని వ్యవసాయ విద్యుత్‌ను 7 గంటల నుండి 9 గంటలకు పెంచేయోచనలో ఉన్న అంశాన్ని వెల్లడించారు. పండుగ అనంతరం కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత కాన్పులు, ప్రమాద భీమా రూ. 5 లక్షలకు పెంపు వంటి పథకాలను ప్రకటించారు. ఇలా రోజుకో అంశంపై సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రత్యర్ధి పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి కారణమైన ఆదరణ పథకాన్ని ఆదరణ – 2 పేరుతో తిరిగి జీవంపోయడంతోనే ఆయన సంక్షేమ పథకాలపై దృష్టిసారించినట్లు అర్థమౌతుందని రాజకీయ విశ్లేషకులు, పార్టీ సీనియర్లు చెబుతున్నారు. అక్కడి నుండి ప్రారంభమైన సంక్షేమ పథకాల పరంపర రోజుకో మలుపు తిరుగుతూ వస్తోంది.
ఇటీవల ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల్లోనూ రుణమాఫీ అమలు చేస్తున్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంగతి పాఠక విధితమే. ఈనేపథ్యంలోనే రైతాంగ సమస్యలపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కసరత్తుచేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పంటల భీమాతో రైతులకు ఉపయుక్తమైన కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబు ఆ పథకం పనితీరుమీద నివేదికలు తెప్పించుకుంటున్నట్లు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో గెలుపు అంశం ప్రధానమైనదైనప్పటికీ, రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఒకవైపు అభ్యర్థుల ఎంపిక మరోవైపు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టే అంశంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈనెల 30 నుంచి అసెంబ్లి సమావేశాలు ప్రారంభం కానుండడంతో, ఈవిషయమై వేగంగా పావులు కదుపుతున్నారు. ఒక పక్క మోడీ, జగన్, కేసీఆర్ నెగటివ్ అజెండాతో వస్తుంటే, చంద్రబాబు మాత్రం పోజిటివ్ అజెండాతో ప్రజల ముందుకు వెళ్తున్నారు.