సీఎం చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేనంతగా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎలా ఉన్నా చేయాలనుకున్నది చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆలోచనలో ఉన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇది చేస్తామని ప్రజలకు చెప్పేకన్నా ఇప్పుడు ఇది చేశాం.. మళ్ళీ అధికారం ఇస్తే ఇంకా చేస్తామని ప్రజలలోకి వెళ్లాలని సన్నాహాలలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే పెన్షన్ల రెట్టింపు చేయడం, రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ, ట్రాక్టర్లు, ఆటోలకు ట్యాక్స్ రద్దు కార్యక్రమాలు అమలుకు శ్రీకారం చుట్టారు. త్వరలోనే కౌలు రైతులతో సహా రైతుల సంక్షేమం కోసం కొత్త పథకం అమలుకు కసరత్తులు జరుగుతుండగా మరికొన్ని పథకాలను, ఎక్కడెక్కడ విమానాశ్రయాలు, ప్రాజెక్టులు, రోడ్లు, పోర్టులు అంటూ రోజూ ఎక్కడోచోట అభివృద్ధి కార్యక్రమాలకు శిలా ఫలకాలు, ప్రారంభోత్సవాలు చేసేస్తున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేలను, మంత్రులను పరుగులుపెట్టిస్తున్నారు. వీటన్నికి అప్పుల కోసం రిజర్వ్ బ్యాంకు వద్దకు వెళ్ళడానికి కూడా సీఎం పథకాన్ని సిద్ధం చేసుకున్నారు.
ఇక జగన్ మోహన్ రెడ్డి విషయానికి వస్తే ప్రజా సంకల్ప యాత్ర తర్వాత విస్తృతంగా ప్రజలలోకి వెళ్లాలని పథకాలను రచించుకున్నా సీఎం దూకుడుతో నేతలకు పాలుపోని పరిస్థితి. ఒక్క ఇటుక పెట్టలేదంటూ రాజధాని నిర్మాణం గురించి వైసీపీ చేస్తున్న విమర్శలను టీడీపీ బలంగా తిప్పుకోడుతూ ఇదిగో రాజధాని నిర్మాణం అంటూ ప్రజలకు అక్కడ జరుగుతున్న నిర్మాణాలను కళ్ళకు కడుతుండడం కూడా వైసీపీకి ఇబ్బందిగా మారింది. ఎన్నికల వేళ ప్రజలకు సీఎం తాయిలాలు వేస్తున్నారని.. ఎన్నికలు వచ్చేసరికి శంకుస్థాపనలు గుర్తొచ్చాయని.. ఇదంతా చంద్రబాబు నాటకాలని.. ఎన్నికల కోసం బూటకాలని పొడివిమర్శలు చేసినా చంద్రబాబు మాత్రం జోరు పెంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓట్ల జాబితాలో తొలగింపులనీ.. షర్మిల వివాదంలో టీడీపీనే దోషి అని.. జగన్ దాడిలో టీడీపీ కుట్ర అంటూ పార్టీ మీద విమర్శలకు పరిమితమవుతున్నారు తప్ప ఇదీ ప్రభుత్వ వైఫల్యమని బలంగా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నా చంద్రబాబు మాత్రం ప్రత్యర్థికి చిక్కని విధంగా దూకుడుతో ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. పోలవరం బ్రాండ్ ఇమేజ్, తిరుపతి హబ్, అనంతపురం కియా మోటార్స్, కృష్ణా జలాలను సీమకు తరలించడం వంటి అంశాలతో పాటు ఇంకేదో ప్రజలుకు రుచి చూపించాలని పక్కా వ్యూహాలతో ఆట మొదలుపెట్టినట్లుగా కనిపిస్తుంది. అందులో పక్క రాష్ట్రాల పథకాలను కాపీ కొట్టారన్నా.. మా నవరత్నాలే మీరు అమలు చూస్తున్నారన్న ప్రజలు పట్టించుకొనే అవకాశం లేదు. ఉదాహరణకు పెన్షన్లు రెట్టింపు అన్నది తెలంగాణలో తెరాస హామీ అయినా ఇంకా అక్కడ అమలుకు నోచుకోలేదు. ఆర్ధిక ఇబ్బందులలో కూడా ఏపీలో అమలవుతుంది. రేపు రైతులకు నగదు బదిలీ పథకం అయినా చంద్రబాబు మక్కీకి దించేంత అమాయకులు కూడా కాదు. ఇందులో లబ్ది ఎంత.. ప్రభుత్వం చేసింది ఏంటి? అన్నదే ప్రజలలో పనిచేసే మంత్రం. ఇదే మంత్రంతో చంద్రబాబు వ్యూహాలను రచించుకుని మొదలుపెట్టినట్లుగా కనిపిస్తుంది. మరి చంద్రబాబు దూకుడును జగన్ అందుకుంటారా? ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కనుక అయన సన్నాహాలలో అయన ఉన్నారా? వైసీపీ ముందున్న వ్యూహాలేంటి? టీడీపీ ఆయుధాలను దెబ్బతీసే అస్త్రమేంటి? అన్నది కొద్దిగా వేచిచూడాలి