మాది నీతివంతమైన పాలన..పారదర్శకత ఉంది.. అందుకే పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. గత నాలుగేళ్ల క్రితం వరకూ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలేమిటో తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. బుధవారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతి ఆరోపణల పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వోక్స్ వ్యాగన్ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకువస్తే కమీషన్లకు కక్కుర్తిపడి బలిపశువును చేయటంతో గుజరాత్ కు తరలివెళ్లిందన్నారు. గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు పరిశ్రమలకు సింగిల్ విండో విధానం ద్వారా పారదర్శకంగా అనుమతులు మంజూరు చేయడంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు.
ప్రపంచమంతా ఏపీ సర్కార్ నిర్ణయాలను స్వాగతిస్తుంటే ప్రతిపక్షనేత మాత్రం రోడ్డెక్కి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పరిశ్రమలు రానివ్వకుండా అభివృద్ధి పనుల్లో నిధులు కాజేసిన కారణంగానే వైఎస్ పాలనలో ఏపీ ఇమేజి డామేజీ అయిందన్నారు. జగన్ నిర్వాకంతో ఐఏఎస్ అధికారులు సైతం జైలుపాలయ్యారన్నారు. ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కుతారు..వాట్ నాన్సెన్స్.. అధికారులను బెదిరిస్తారు. అలాంటి వారా మామీద ఆరోపణలు చేసేదని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా FDIల్లో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటైన కియా మోటార్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలోని మొదటి అంశమే అవినీతికి ఆస్కారం ఇవ్వరాదని ఉందని, ఆ భరోసాతోనే పరిశ్రమను స్థాపించార న్నారు.
వోక్స్ వ్యాగన్ వస్తే రాష్ట్రం ఎప్పుడో ఆటోమొబైల్ హబ్ గా మారేదన్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్రానికి కియాతో పాటు ఇసుజు, అపోలో టైర్స్, భారత్ లేలాండ్ వంటి సంస్థల ఏర్పాటుకు కృషి చేశామన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పెను మార్పులతో పెట్టుబడి దారులతో పాటు పేద వర్గాల్లో విశ్వసనీయత పెంపొందించ గలిగామని స్పష్టంచేశారు. కాగా తన సింగపూర్ పర్యటన సుహృద్భావ వాతావరణంలో జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పేరు ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసేందుకు చేసిన ప్రయత్నంలో ప్రపంచ నగరాల సదస్సు వేదిక పై సఫలమయ్యామని చెప్పారు. ఇప్పటివరకు తాను ఆరు బిజినెస్ పెట్టుబడుల సదస్సులను నిర్వహించానని, నవ్యాంధ్ర ఏర్పడిన అనంతరం మూడు సదస్సులను నిర్వహించామని తెలిపారు.