తమిళనాడు తరహా కుతంత్రాలు ఇక్కడ సాగవు.. ఆనాడు ప్రధానమంత్రి పదవినే కాదన్నా.. హక్కుల కోసం ప్రశ్నిస్తే బురదజల్లుతారా.. నామీద కోసం ప్రజలపై చూపద్దు.. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు ఎందుకు నెరవేర్చరో ప్రజలకు సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ 37వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరులోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తల నుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలుగుప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు చిరస్థాయిగా పార్టీ నిలిచి ఉంటుందన్నారు. పేదలపాలిట పెన్నిధిగా నిలిచిన ఎన్టీఆర్‌ను సైతం ఆరోజు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసి ప్రజాగ్రహాన్ని చవిచూసిందని గుర్తుచేశారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎదురుదాడి కొత్తేమీ కాదన్నారు.
నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే-1ల ఏర్పాటు నేపథ్యంలో అప్పట్లో ప్రధాన మంత్రి పదవి అవకాశం వచ్చినా తృణప్రాయంగా తిరస్కరించామన్నారు. రాష్ట్రాన్ని హేతుబద్ధతలేకుండా ఓ జాతీయ పార్టీ కుక్కలుచింపిన విస్తరి చేస్తే మరో పార్టీ ఆదుకుంటామని ఇచ్చిన హామీ మేరకు బీజేపీకి మద్దతి చ్చామన్నారు. గత నాలుగేళ్లుగా హామీలను అమలు చేయకుండా విస్మరించటం వల్లే ఎన్డీయే నుంచి వైదొలగామని తెలిపారు. అండగా నిలుస్తుందని ఆశిస్తే అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోందని ధ్వజమెత్తారు. ఎక్కడా ఏ తప్పు చేయం.. కక్కుర్తి రాజకీయాలతో ఇరుకున పెట్టాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ వైపు హోదా కావాలని కాలు దువ్వుతూ మరోవైపు అంతర్గతంగా ప్రధాని కాళ్లకు మొక్కుతున్నారని విమర్శించారు. నాలుగేళ్లు సహకరించిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అవగాహనా రాహిత్యంతో బురద చల్లుతున్నారని మండిపడ్డారు.
పోలవరాన్ని అడ్డుకునే ప్రయత్నంచేస్తే మాడి మసైపోతారని హెచ్చరించారు. మాకు ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు.. విభజనతో హక్కుగా వచ్చినవే అడుగుతున్నాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. స్వశక్తితో ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం చేపడతామన్నారు. ఇందుకు ప్రజలు తమ శక్తికొలదీ సహకరించాలని పిలుపునిచ్చారు. నాలుగు దశాబ్దాల ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఆంధ్ర, తెలంగాణలో నిర్ణయాత్మకశక్తిగా రూపుదిద్దుకుని తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అండగా తమ పార్టీ నిలుస్తుందని భరోసా ఇచ్చారు.