మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ పూర్వాపరాలను పరిశీలించాలని ఏజీ, న్యాయ నిపుణులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. గతంలో కేసును డిస్పోజల్ చేసినట్టు వెబ్‌సైట్‌లో చూపడం..ఆ తర్వాత పలు సెక్షన్ల కేసు నమోదు చేయడం, నోటీసులు ఇవ్వకపోవడం...తాజాగా అరెస్ట్‌వారెంట్ అంశాలపై సీఎం.. న్యాయ నిపుణుల సలహా కోరారు. ఆ కేసులో ఉన్న ఎమ్మెల్యేలు, కేబినెట్ సహచరులతో చంద్రబాబు చర్చలు జరుపనున్నారు. ఈనెల 23న చంద్రబాబు అమెరికా వెళ్తుండటంతో కేసు ప్రతిబంధకమవుతుందా అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
బాబ్లీ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా 2010లో జరిగిన ఆందోళన నేపథ్యంలో మహారాష్టల్రోని ధర్మాబాద్ కోర్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా 16 మందికి నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేయటం ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల టీడీపీ శ్రేణుల్లో కలకలం చెలరేగుతోంది. బాబ్లీ ప్రాజెక్టును నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారంటూ అప్పట్లో చంద్రబాబుతో సహా పలువురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నాయకులు ప్రాజెక్టు ముట్టడికి యత్నించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుతో సహా ఆందోళనకు దిగిన సుమారు 80 మందిని ఒకే చోట నిర్బంధించి ఆపై కేసులు నమోదు చేసింది. ఈ సంఘటన యూపీఏ హయాంలో జరిగితే తాజాగా ఎన్డీయే ప్రభుత్వం కేసును తిరగతోడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేయటం అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ, వైసీపీల కుట్రలో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు పంపారని రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా స్పందించకుండా ఇప్పుడే నోటీసులు అందజేయటంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీలతో సహా సీపీఐ, కాంగ్రెస్‌లతో కలిసి మహాకూటమిగా అవతరించేందుకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో నోటీసులు ఏ రకమైన ప్రభావం చూపుతాయనే విషయమై తెలుగుదేశం పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈనెల 21వ తేదీలోగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించటంతో ఏం జరుగుతుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది.