భాజపా దొంగాట, దూకుడుకు కళ్లెం వేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజాదర్బార్ హాల్‌లో సాధికార మిత్రలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రానికి న్యాయం కోసం ముఖ్యమంత్రిగా ప్రధానితో పోరాడుతున్నా.. అందరూ సహకరించి ఏకతాటిపైకి రావాలి. ప్రజలను చైతన్య పరిచి పోరాటానికి సిద్ధం చేసేందుకే దీక్ష చేశా. లాలూచీ రాజకీయాల వల్ల మనం నష్టపోతాం. ఈ రాష్ట్రం ఐకమత్యంగా ఉంటే, ఐదుకోట్ల మంది ముక్తకంఠంతో పోరాడితే ఇవాళ కాకపోతే రేపైనా న్యాయం జరుగుతుంది. కేంద్రం చాలా అహంభావంతో ఉంది. విజ్ఞత కలిగిన నాయకుడిగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నా. తప్పకుండా కేంద్రం దిగొచ్చేలా చేస్తాం అని అన్నారు.
వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని ఎంపిక విషయంలో... తమ నిర్ణయమే కీలకంగా ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు. కథువాలాంటి ఘటనలను నివారించడంలో కేంద్రం విఫలమైందని దుయ్యబట్టారు. కేంద్రం తీరువల్ల దళితుల్లో అలజడి చెలరేగిందని, బీజేపీకి రాష్ట్రంలో ఒక్క ఓటు రాదు...ఒక్క సీటు రాదని ఆయన జ్యోసం చెప్పారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే విరుచుకుపడుతున్నారని బాబు మండిపడ్డారు. కేంద్రం దిగొచ్చేలా చేస్తామని, మన లక్ష్యాన్ని సాధించి తీరుతామని స్పష్టం చేశారు. మోదీకి నాలుగు సీట్లు తక్కువ వచ్చి ఉంటే మన మాట వినేవారని, పటేల్ విగ్రహానికి 2500 కోట్లు ఇచ్చారు.. రాజధానికి రూ. 1500 కోట్లే ఇచ్చి లెక్కలు చెప్పలేదంటున్నారని, ఒక విగ్రహానికి ఇచ్చిన విలువ రాష్ట్రానికి ఇవ్వరా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు.
ప్రధాని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని, ఇబ్బందులు ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలన్నారు. తిరుపతి వెంకన్ననే నమ్ముకున్నామని, వడ్డీతో సహా అన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి చేస్తూనే మన హక్కుల కోసం పోరాడతామని, మోదీ గుజరాత్ సీఎం కాదు...దేశ ప్రధాని... దేశం మొత్తానికి మోదీ న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఒకప్పుడు డబ్బు సంపాదన కోసం కష్టపడే వాళ్ళమని, ఇప్పుడు ఏటీఎంలలో డబ్బు తీసుకోవడానికి కష్టపడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. "బంద్‌కు పిలుపు ఇచ్చి రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీయొద్దు. అలా చేస్తే పరోక్షంగా ప్రధాని మోదీకి సహకరించినట్లే అవుతుంది. రాష్ట్రం అంటే బాధ్యత లేదు కాబట్టే అఖిలపక్ష సమావేశానికి అన్ని సంఘాలు వచ్చినా పార్టీలు రాలేదు. లాలూచీ రాజకీయాలు ఉన్నాయి కాబట్టే కొన్ని పార్టీలు కూడగట్టుకుని రాలేదు" అని చంద్రబాబు అన్నారు.