ఉండవల్లిలోని ప్రజాదర్బార్‌లో బుధవారం అంగన్వాడీ కార్యకర్తలు, సాధికారమిత్రలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గున్నారు. ఐదు కోట్ల మంది సంతృప్తిగా ఉండేందుకు, సమస్యల పరిష్కారం జరిగేందుకు సాధికార మిత్రలు సేవాభావంతో పనిచేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 1.42 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్రను నియమించాం. ప్రతి సాధికార మిత్ర తన పరిధిలోని కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో చూసి అన్నీ అందేలా సాయం చేయాలి. ఎక్కడా, ఎవరికీ ఇబ్బంది లేకుండా చేయడం.. వారి పవిత్ర బాధ్యత’ అని తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం ప్రజలు సంతృప్తిగా ఉండేలా చేయడమే తన లక్ష్యమని, అందుకోసం ఐదు లక్షల మంది సాధికార మిత్రల సైన్యం తనతో ఉందని తెలిపారు. ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం ఆదర్శంగా తయారుకావాలన్నారు. ప్రతి కుటుంబం నెలకు రూ.10 వేల ఆదాయం ఆర్జించేలా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా అనుసంధానం చేసి అందేలా చూడాలని చెప్పారు. సమస్యలు, లోపాలుంటే ప్రభుత్వానికి చెప్పి పరిష్కరించాలన్నారు.
అయితే, ఈ సందర్భంలో, ఇద్దరు సాధికార మిత్రలు చేసిన ప్రసంగంతో, చంద్రబాబు ఫిదా అయ్యారు. కర్నూల్ జిల్లా నుంచి వచ్చిన, సావిత్రి అనే సాధికార మిత్ర మాట్లాడుతూ "‘సారూ! నేనిదే ఫస్ట్ మాట్లాడడం. నాకిచ్చిన 35 కుటుంబాలకు వెళ్లా. ఇద్దరికి ఇళ్లు మంజూరైనా బిల్లుల్లేవు. 8 మంది వృద్ధులకు పింఛన్లు లేవు. ఆ ఇద్దరికీ రూ.90వేలకు పైగా బిల్లులు మంజూరు చేయించా. ఆధార్ కార్డు ఆన్‌లైన్ కాకపోవడం వల్ల పింఛను రాలేదని తెలిసింది. ఇతర సాధికార మిత్రలతో కలిసి వెళ్లి ఆధార్ అనుసంధానం చేయించా. 15వ తేదీన దరఖాస్తు చేస్తే ఒకటో తేదీనే పింఛను వచ్చేసింది. అందరికీ వచ్చేసింది. నువ్వు, నీ కుటుంబం చల్లగా ఉండాలమ్మా అని తాతలు అన్నారు. ఈ దీవెనలు చంద్రన్నకు చెప్పాలి.. ఆయన పనే ఇది.. మళ్లీ వస్తాడని చెప్పా.’ అని అన్నారు.
అలాగే, కర్నూల్ జిల్లా నుంచి వచ్చిన, సుజాత అనే సాధికార మిత్ర మాట్లాడుతూ ‘నాకు కేటాయించిన ప్రతి ఇంటికీ తిరిగా. ఒక కుటుంబంలో భర్తకు రెండు కిడ్నీలు పోయాయి. డయాలసిస్ చేయిస్తున్నారు. చిన్న వయసే. భార్య నాతో చాలా బాధగా ఏడుస్తూ కష్టాలు చెప్పింది. ఆమె టీటీసీ చేసింది. ఆమె కష్టం చూసి ఏడుపొచ్చింది. ముఖ్యమంత్రి సదస్సుకు వెళ్తున్నా. నీ కష్టం చెప్తానని వచ్చా. మీరే ఏదైనా చేయాలి...’ దీని పై ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. కిడ్నీ బాధితుడికి రూ.2 లక్షలు తక్షణ సాయంగా ప్రకటించారు. సాధికార మిత్రలు తమ పరిధిలోని కుటుంబాలపై పూర్తి అవగాహన తెచ్చుకుంటే ఎలాంటి సేవ చేయగలరన్నదానికి ఈ ఇద్దరు సాధికార మిత్రలే ఉదాహరణని చెప్పారు.